ఆరు నెలల్లో పూర్తి చేస్తాం
ఈ నూతన భవనంలో ఐసీయూ, ట్రామా కేర్, మాతా–శిశు విభాగం, డయాలసిస్, అత్యవసర విభాగం, రోగులకు ఒకేచోట అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, మాడ్యులర్ ఐసీయూలు, వెంటిలేషన్ సదుపాయాలు, డయాలసిస్ కేంద్రం, డిజిటల్ ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కాన్, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, బ్లడ్ బ్యాంక్, ట్రామా కేర్ విభాగం, ప్రత్యేక ప్రసూతి, శిశు వైద్య విభాగాలు క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. భవన నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలు కూడా త్వరితగతిన చేపట్టాల్సిన అవసరం ఉంది.
అత్యవసర వైద్య సేవలు కావాల్సి వస్తే అంబు లెన్స్‌లో హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మంకు పరుగులు తీసే కాలం చెల్లబోతోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో రూ.192 కోట్ల నిధులతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అందు బాటులోకి రానుంది. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు
అందనున్నాయి.
సూర్యాపేటటౌన్ : జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సర్వజన ఆస్పత్రి (జనరల్ హాస్పిటల్) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. అంతర్గత మౌలిక వసతుల ఏర్పాటు, విద్యుత్, ఆక్సిజన్ పైప్‌లైన్లు, వైద్య పరికరాల అమరిక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆస్పత్రి ప్రారంభమైతే సూర్యాపేట జిల్లాతోపాటు సమీప జిల్లాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోగులు హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
రూ.192 కోట్ల వ్యయంతో..
సూర్యాపేట పట్టణంలో ప్రస్తుతం ఉన్న జనరల్ ఆస్పత్రి పక్కనే నిర్మిస్తున్న నూతన సర్వజన ఆస్పత్రి భవనానికి ప్రభుత్వం సుమారు రూ.192 కోట్ల మేర నిధులు మంజూరు చేసింది. బహుళ అంతస్తులతో విశాలమైన ప్రాంగణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 350 పడకలు ఉండగా.. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనంలో మరో 650 పడకలకు సరిపడా నిర్మాణం జరుగుతోంది. మొత్తం కలిపి వెయ్యి పడకల ఆస్పత్రిగా మారనుంది. నూతన భవనంతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనంపైన అదనంగా మరో మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. నూతన భవనాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. రెండు భవనాలు కలిసి సుమారు 3.54 లక్షల చదరపు అడుగులతో నిర్మిస్తున్నారు. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
అత్యాధునిక హంగులతో..
జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో సర్వజన ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నారు. ఆస్పత్రి ప్రారంభమైతే సూర్యాపేట జిల్లా వైద్య రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. రోగులు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా హాస్పిటల్ లోపల నాలుగు భారీ లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే సూర్యాపేట జిల్లా వైద్య సేవల రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లే.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నూతన జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అత్యాధునిక హంగులతో భవన నిర్మాణం కొనసాగుతోంది. మొత్తం ఐదు అంతస్తుల్లో భవనం నిర్మాణం జరుగుతోంది. మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.
–రాజశేఖర్, ఈఈ, టీఎంఎస్‌ఐడీసీ
ఫ వేయి పడకలు.. నాలుగు లిఫ్టులు
ఫ తుది దశకు చేరిన పనులు
ఫ త్వరలో అందుబాటులోకి రానున్న మెరుగైన వైద్య సేవలు


