ఆక్రమణదారులపై చర్యలు చేపడతాం
మట్టిపోసి చదును చేస్తున్నారు
మునగాల : నీటితో కళకళలాడాల్సిన చెరువు శిఖం భూములు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి.చెరువు సరిహద్దుల్లో ఉన్న కొంతమంది రైతులు శిఖం భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నప్పటికీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మునగాల మండల కేంద్రంలోని ఊరచెరువుతోపాటు తాడువాయి శివారులోని ఎర్రచెరువు ఆక్రమణకు గురవుతున్నాయి. అయినా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రెండు నెలలుగా మునగాల ఊరచెరువు, తాడువాయి ఎర్రచెరువులకు చెందిన శిఖం భూముల్లో కొంతమంది రైతులు యథేచ్ఛగా మట్టి తోలకం పనులు చేపట్టి, చదును చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు, నీటిపారుదల శాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆక్రమణదారులు రోజురోజుకూ మరింత రెచ్చిపోతున్నారు.
ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా..
చెరువుల ఆక్రమణలపై స్థానిక అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఇరు శాఖల అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కబ్జాల కారణంగా చెరువుల విస్తీర్ణం కుంచించుకుపోతోంది. దీనివల్ల భవిష్యత్‌లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే చెరువులను నమ్ముకుని మత్స్య సంపదపై జీవనం సాగిస్తున్న వందలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు స్పందించి, చెరువుల ఆక్రమణలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాడువాయి ఎర్రచెరువు, మునగాల ఊరచెరువును కొంతమంది మట్టిపోసి చదును చేసి ఆక్రమణ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు చేపడతాం.
–వినయ్‌కుమార్‌రెడ్డి,
ఇరిగేషన్ శాఖ ఏఈఈ, మునగాల
ఫ నీటి నిల్వ సామర్థ్యం
తగ్గిపోయే అవకాశం
ఫ మత్స్యకారుల ఉపాధికి గండం
ఫ ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు


