తుంగతుర్తి : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చినా అన్నదాతకు కష్టాలు తీరడం లేదు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కాంటా వేయకపోవడంతో రైతుల గుండెలు మండిపోతున్నాయి. తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో రైతు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాలోతు సీతారాం ధాన్యం పోసి రెండు నెలలు దాటినా కాంటాలు వేయడం లేదని ఆవేదనతో గురువారం తన ధాన్యపు రాశికి నిప్పు పెట్టబోయాడు. పక్కనే ఉన్న రైతులు అతడిని వారించి నిప్పు పెట్టకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో గతంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కాంటాలు అయ్యేవని అన్నారు. కానీ ఈసారి సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఈ కేంద్రంలో హమాలీలు ఇష్టానుసారంగా కాంటాలు వేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కాంటాలు సీరియల్ ప్రకారం త్వరత్వరగా వేయాలని డిమాండ్ చేశారు.


