నడిగూడెం : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్‌లో చేరాలని ఆ విద్యాలయాల సంస్థ డీసీఓ సీహెచ్.పద్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 7వ తేదీలోపు ఆయా కళాశాలల్లో చేరాలని పేర్కొన్నారు.
ఉద్యోగుల మధ్య
ఘర్షణపై విచారణ
గరిడేపల్లి : రెండు రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయంలో ఇద్దరి ఉద్యోగుల మధ్య జరిగిన గొడవపై సోమవారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ మహాలక్ష్మి విచారణ జరిపారు. జరిగిన సంఘటనపై కార్యాలయంలోని సిబ్బందిని, ఇతరులను విచారించి వివరాలను సేకరించారు. కార్యాలయం ఆవరణలో సీనియర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న విషయంపై, సర్వీస్ బుక్‌లో వివరాలను నమోదు చేయలేదనే అంశంపై ఆమె విచారణ నిర్వహించినట్లు తెలిపారు. విచారణ అనంతరం ఆమె మాట్లాడుతూ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ఆమె వెంట ఎంపీడీవో సరోజ తదితరులు ఉన్నారు.
జిల్లా పోలీసులకు
సేవా పతకాలు
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్లో జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకం, సేవా పతకాలు వరించాయి. ఇందులో జిల్లా అదనపు ఎస్పీ యు.రవీందర్‌రెడ్డికి రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పతకం లభించింది. సీసీఎస్ ఏఎస్‌ఐ వెంకన్న, డీసీ ఆర్‌బీ కానిస్టేబుల్ శ్రీధర్, ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణయ్య, ఏఆర్ కానిస్టేబుల్ మధుమోహన్‌లకు సేవా పతకాలు వచ్చాయి. ప్రతిభ అవార్డులు పొందిన సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ అభినందించారు. ఉత్తమ సేవలకు ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందన్నారు.
శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణం జరిపారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
వాణిజ్య పన్నుల శాఖ
విస్తరణ
నల్లగొండ : వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్, సర్కిల్ కార్యాలయాలను విస్తరించింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక డివిజన్‌తోపాటు 5 సిర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రటించింది. దీంతో జిల్లాలో అదనంగా ఆరు కార్యాలయాల ఏర్పాటు కానున్నాయి. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
మహా శివుడికి పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు.


