భానుపురి (సూర్యాపేట) : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’పై జిల్లాలో ఫోకస్ నెలకొంది. ఓవైపు అధికారులు, మరోవైపు రాజకీయ పార్టీలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై దృష్టి సారించారు. జూలై 31లోగా ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు మ్యాపింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. పలు కారణాలతో ఇప్పటి వరకు మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. మ్యాపింగ్‌తోనే బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు అధికార యంత్రాంగం, కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండగా.. అర్హులైన వారి ఓట్లు తొలగింపునకు గురి కాకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో భారీగా ఓట్లు తగ్గిపోవడంతో పాటు అధికార మార్పిడి కూడా జరగడంతో అధికార కాంగ్రెస్ ముందస్తుగా చర్యలు చేపట్టింది.
పారదర్శకంగా ఉండేలా..!
ఎలాంటి తప్పులు లేని, పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసం జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కీలకమైన ఓటర్ల మ్యాపింగ్, భౌగౌళిక సరిహద్దులు, పోలింగ్ కేంద్రాల పరిధికి అనుగుణంగా చేపడుతున్నారు. మొదటి విధానంలో 2002 ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితాతో సరిపోల్చుతున్నారు. రెండో విధానంలో 2002 ఓటరు జాబితాను సేకరించి.. ఆ తర్వాత ఓటు హక్కు పొందిన వారి సంతానం సమాచారంతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు 70 శాతం మేర జరిగినట్లు తెలుస్తోంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికి తిరిగి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో వారికి ఈ నెల 15 నుంచి 24 వరకు సమగ్రంగా శిక్షణ ఇవ్వనున్నారు.
క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ చేస్తున్న బీఎల్‌ఓలు
తమ ఓటర్లు జాబితాలో ఉండేలా రాజకీయ పార్టీల ప్రయత్నాలు
బూత్ స్థాయిలో కమిటీలు, శిక్షణ


