నేటి నుంచి ఇంటర్‌ తరగతులు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ తరగతులు

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

సూర్యాపేటటౌన్‌ : వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత కళాశాలలు తెరుచుకోనుండగా.. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యారు. విద్యార్థుల హాజరుశాతం పెంపుతో పాటు ఉత్తమ ఫలితాల సాధనపై ఆయా కళాశాలల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.

జిల్లాలో 87 జూనియర్‌ కళాశాలలు..

సూర్యాపేట జిల్లాలో మొత్తం 87 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎనిమిది ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేట్‌ కళాశాలలు, గురుకులాలు, మోడల్‌, కేజీవీబీలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ విద్యను అభ్యసిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచే పాఠ్యాంశాల బోధన ప్రారంభించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించింది.

అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి..

ఇటీవల పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉచిత విద్యా సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యాబోధన జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

బ్రేక్‌ ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు తెలంగాణ బ్రేక్‌ ఫాస్ట్‌ పథకం కింద 5 రకాల టిఫిన్లు అందించనున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో అల్పాహారం, మూడు రోజులు పాలు(150 మి.లీ.), మూడు రోజుల రాగిజావ అందించనున్నారు. అల్పాహారంలో ఇడ్లీ, మిల్లెట్‌ఇడ్లీ, ఉప్మా, దోసె, బోండాలు, పూరీలను అందించనున్నారు. బ్రేక్‌ ఫాస్ట్‌తోపాటు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు.

పునఃప్రారంభం కానున్న జూనియర్‌ కళాశాలలు

జిల్లాలో 8 ప్రభుత్వ కళాశాలలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement