మఠంపల్లి: మండలంలోని పలు గ్రామాల గుండా వెళ్లే రైల్వే లైన్ మార్గంలో అండర్‌పాస్‌లు ఏర్పాటు చేశారు. అయితే అండర్‌పాస్‌లు లోతట్టుగా ఉండడం, వరదనీటి పారుదల సౌకర్యం లేక పోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద నీరు అక్కడే నిల్వ ఉండి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మండలంలోని తీగెలచెరువుతండా, అవిరేణికుంట తండా, లాలితండా, తుమ్మలతండా, మంచ్యాతండా గ్రామాల పరిధిలో ఉన్న అండర్‌పాస్‌లు లోతుగా నిర్మించారు. కొద్ది పాటి వర్షం వచ్చినా ఇందులో భారీగా నీరు నిల్వఉంటోంది. 15 నుంచి నెలరోజుల పాటు అండర్‌పాస్ వద్ద బురద, నీరు నిల్వ ఉండి వాటి గుండా ప్రయాణించేందుకు ఆయా గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారిపడడంతో గాయాల పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రైల్వే అధి కారులు స్పందించి అండర్ పాస్ బ్రిడ్జీల కింద వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వరదనీటి నిల్వతో రాకపోకలకు
అంతరాయం


