హోటళ్లలో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

హోటళ్లలో తనిఖీలు

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

యాదగిరిగుట్ట : పట్టణంలోని పలు హోటళ్లలో జిల్లా ఇన్‌చార్జి ఫుడ్‌సేఫ్టీ అధికారి శివశంకర్‌ ఆదివారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీరాంనగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న మంత్రాలయం హోటల్‌లో సోయా సాస్‌లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వంటలకు ఉపయోగించే నూనె ఓవర్‌ హీట్‌ కావడం, కిచెన్‌లో వంట పాత్రలపై మూతలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న త్రినేత రాఘవేంద్ర హోటల్‌లో సైతం ఛాయ్‌ పత్తా కలర్‌ ఎక్కువగా ఉందని, పిండి పదార్థాలు బాగులేవని గుర్తించారు. సన్నిధి ఎమరాల్డ్‌ హోటల్‌లో ఆరు సాస్‌ బాటిల్స్‌ గడువు ముగిసినట్లు గుర్తించారు. వీటిని స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌కు పంపుతామని ఆయన వెల్లడించారు. త్రినేత్ర రాఘవేంద్ర, మంత్రాలయం హోటల్స్‌లో వాటర్‌ బాటిల్స్‌ శాంపిల్స్‌ తీసుకున్నామని, సోయా సాస్‌లను సైతం శాంపిల్స్‌ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయా హోటల్స్‌ కిచెన్స్‌ అపరిశుభ్రంగా ఉన్నాయని, శుభ్రత పాటించాలని ఆయన సూచించారు.

వరి కొయ్యలకు నిప్పు

గడ్డివాములు, పైపులు దగ్ధం

ఆత్మకూరు(ఎస్‌) : మండల పరిధిలోని బొప్పారం శివారు ఏపూర్‌ తండాలో ఆదివారం వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 4ఎకరాలకు పైగా పంట చేలలో పచ్చని చెట్లు, గడ్డివాములు, విద్యుత్‌ స్టార్టర్లు, పైపులు మంటల్లో కాలిపోయాయి. స్థానికులు ఫైరింజన్‌ సహకారంతో మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని అధికారులు ఎంత హెచ్చరించినా రైతులు ఆపడం లేదు.

సాగర్‌లో

పర్యాటకుల సందడి

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వేసవివ సెలవులతో పాటు వీకెండ్‌ కావడంతో పర్యాటకు అధిక సంఖ్యలో తరలివచ్చి సాగర్‌ డ్యాం, బుద్ధవనం సందర్శించారు. విజయవిహార్‌ అతిథి గృహంలో బస చేసిన పలువురు పర్యాటకులు ప్రత్యేక సైకిళ్లతో పాటు బ్యాటరీ వాహనాల్లో సంచరించారు. వేసవి వేడిని తట్టుకునేందుకు విజయవిహార్‌ సమీపంలోని ఈత కొలనులో స్విమ్మింగ్‌ చేస్తూ కనిపించారు. లాంచీలలో నాగార్జునకొండకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు.

ఇద్దరు ఐటీఐ

ప్రిన్సిపాళ్ల బదిలీ

ఆలేరు : ఆలేరు, భువనగిరి పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ప్రిన్సిపాళ్లు బదిలీ అయ్యారు. ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్‌ బి.హరికృష్ణను మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట ఐటీఐకు, భువనగిరి ప్రిన్సిపాల్‌ జయను హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌ ఐటీఐకి బదిలీ చేశారు. గద్వాల ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎస్‌వీవీ సత్యనారాయణను ఆలేరుకు, శామీర్‌పేట ఐటీఐ ప్రిన్సిపాల్‌ లలితను భువనగిరికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement