
సచివాలయ ఉద్యోగుల నిరసన బాట
గుడిబండ: ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను స్థానికంగానే అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఐదేళ్లపాటు విజవంతంగా నడిపించింది. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా సాకారం చేసింది. అయితే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సచివాలయ ఉద్యోగులు స్థానిక తహసీల్దార్ కార్యలయం వద్ద నిరసనకు దిగారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ పట్టణ ఉద్యోగులకు మండలంలో కాకుండా స్థానిక వార్డులను యూనిట్‌గా పరిగణించాలని కోరారు. మిగులు సిబ్బందిని ఎలా గుర్తించి నిర్వహిస్తారనే దానిపై జీఓలో స్పష్టత లేదన్నారు. పారదర్శక ప్రమాణాలు లేకుండా డిప్యూటేషన్లు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీలు ప్రారంభించే ముందు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, ఇంక్రిమెంట్లు ఇతర ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని కోరారు. మరో రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే సచివాలయ ఉద్యోగులు పెన్‌డౌన్, సమ్మె వంటి వాటికి సైతం వెనుకాడేది లేదన్నారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ గంగాధర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
పెనుకొండ రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ సచివాలయ ఉద్యోగులు మంగళవారం ఎంపీడీఓ నరేష్‌కృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. మండల వ్యాప్తంగా వివిధ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, మంగళవారం ఎంపీడీఓకు కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.

సచివాలయ ఉద్యోగుల నిరసన బాట