
‘ఎంటీఎస్’ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా పడింది. మూడు రోజుల క్రితం జరిగిన కౌన్సెలింగ్‌ను బాయ్‌కాట్ చేసిన టీచర్లు రెండోమారు మంగళవారం జరపాలని చూసిన కౌన్సెలింగ్‌లోనూ పాల్గొనకుండా బాయ్‌కాట్ చేయడం విశేషం. స్థానిక సైన్స్ సెంటర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ను ఎంటీఎస్ టీచర్లు అడ్డుకున్నారు. తమపట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందంటూ వాపోయారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, డీఏ, హెచ్‌ఆర్‌ఏ సదుపాయం ఉండదన్నారు. ఇలాంటి వారందరికీ జిల్లా సరిహద్దు మండలాల్లో కనీసం రవాణా సదుపాయం లేని స్కూళ్లకు కేటాయిస్తే ఎలా పోవాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నియర్ బై రెసిడెంట్’ ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మొండిగా కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం
మరోవైపు విద్యాశాఖ అధికారులు మొండిగా కౌన్సెలింగ్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో సీనియార్టీ జాబితాలో ఉన్న పేర్లను పిలుస్తూ లోపలికి వచ్చి నచ్చిన స్థానాలు ఎన్నుకోవాలి.. లేదంటే బలవతంగా స్థానాలు కేటాయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఎంటీఎస్ టీచర్లు తిరగబడ్డారు. లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియను అంతటితో ఆపేశారు.
ఆర్జేడీ నోటా పాత మాటే
రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయనతో పాటు డీఈఓ ప్రసాద్‌బాబును చుట్టుముట్టారు. ఆర్జేడీ నోటి నుంచి కూడా పాతమాటే వచ్చింది. విద్యార్థులకు సరిపడా పోస్టులు మాత్రమే ఉన్నాయని అంతకు మించి చూపించడం సాధ్యం కాదంటూ తెగేసి చెప్పారు. దీంతో ఎంటీఎస్ టీచర్లు ఆర్జేడీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ‘మా జీవితాలతో ఆడుకోవద్దండి. ఇంత ఇబ్బందులు పెట్టే బదులు కాసింత విషం ఇచ్చి చంపండి’ అంటూ వాపోయారు. సహకరించాలని ఆర్జేడీ కోరినా.. ఎంటీఎస్ టీచర్లు అంగీకరించలేదు. రాత్రి 8 గంటల సమయంలో బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.
దూర ప్రాంతాలకు వెళ్లేందుకు టీచర్ల ససేమిరా