
కేవీకే పుట్టపర్తిలోనే ఏర్పాటు చేయాలి
పుట్టపర్తి: కృషి విజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే) పుట్టపర్తి సమీపంలోనే ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి, అగ్రి అడ్వైజరీ బోర్డు జిల్లా మాజీ చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి డిమాండ్ చేశారు. అలాకాకుండా మరో ప్రాంతానికి తరలిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంగళవారం పుట్టపర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు. 2023లో అప్పటి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కృషితో జిల్లాతో పాటు మూడు జాతీయ రహదారులు, పుట్టపర్తిలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. రైతులకు ఎంతగానో ఉపయోగపడే కృషి విజ్ఞాన కేంద్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బత్తలపల్లి మండలానికి తీసుకెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. పుట్టపర్తిలోనే ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చొరవ చూపాలని.. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
అభివృద్ధి పనులు చేపట్టాలి
గత ప్రభుత్వంలో మంజూరైన నల్లమాడలో మార్కెట్‌యార్డు, పుట్టపర్తిలో 20 ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం, రూ.864 కోట్ల వ్యయంతో ప్రారంభమైన 193 చెరువులకు నీళ్లు నింపే పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డిని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. మలకవేముల క్రాస్ నుంచి నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు మీదుగా కర్ణాటకలోకి కలిసే జాతీయ రహదారి మంజూరుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాతంగి తిప్పన్న, వైఎస్సార్‌సీపీ నాయకులు రవినాయక్, ఈశ్వరయ్య, గంగాద్రి, ఫొటో సాయి, చెరువు భాస్కర్‌రెడ్డి, కేశప్ప తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్