‘ఎందుకీ డబుల్‌ గేమ్‌?’.. వినేశ్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ ఆగ్రహం | Vinesh Phogat Slams WFI They Deliberately Blocking My Return, Federation Denies Claims, Read Story For More Details | Sakshi
Sakshi News home page

‘ఎందుకీ డబుల్‌ గేమ్‌?’.. వినేశ్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ ఆగ్రహం

Apr 28 2026 1:45 PM | Updated on Apr 28 2026 1:56 PM

Vinesh Phogat Slams WFI They Deliberately Blocking My Return

భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రెజ్లింగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌కుండా రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూఎఫ్ఐ) త‌న‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా అడ్డుకుంటుంద‌ని పేర్కొంది. మీడియా ప్ర‌తినిధుల‌తో వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ.. ‘నేష‌న‌ల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పున‌రాగ‌మ‌నం చేయాల‌ని ఆశిస్తున్నాను. రిజిస్ట్రేష‌న్ గ‌డువు ఏప్రిల్ 30 వ‌ర‌కు ఉంది. 

అయితే నేను రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే, గ‌డువు ముగిసిన‌ట్లు పోర్ట‌ల్‌లో చూపిస్తోంది. ఈ విష‌యాన్ని డ‌బ్ల్యూఎఫ్ఐ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌తో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించాను. కానీ వారు నా ఫోన్‌కాల్‌కు రెస్పాండ్ అవ్వ‌డం లేదు. నేను టోర్నీలో పాల్గొనాల‌ని చూస్తుంటే ఫెడ‌రేష‌న్ మాత్రం న‌న్ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే రెజ్లింగ్‌లో రీఎంట్రీ ఇవ్వ‌కుండా అడ్డుకుంటున్న‌ట్లుగా అనిపిస్తోంది. 

ఫెడ‌రేష‌న్ క‌ప్‌లో పాల్గొందామంటే అక్క‌డ నిబంధ‌న‌లు పూర్తిగా మార్చేశారు. ఇలా ప్ర‌తి అంశంలోనూ డ‌బ్ల్యూఎఫ్ఐ అడ్డుప‌డుతూనే వ‌స్తోంది. ఏషియ‌న్ గేమ్స్‌, ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్ వంటి సెలెక్ష‌న్ ట్ర‌య‌ల్స్‌లో పోటీలో ఉండాలంటే ఈ టోర్న‌మెంట్ నాకు ఎంతో కీల‌కం.’ అని వినేశ్ ఆరోపించారు.  

వినేశ్‌ రిజిస్ట్రేషన్ చేసుకుంది: సంజయ్‌
అయితే వినేశ్ ఆరోప‌ణ‌ల‌పై డ‌బ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ సంజ‌య్ సింగ్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫొటో స్క్రీన్‌షాట్‌ను సంజయ్ సింగ్ పంచుకున్నారు. ‘వినేశ్ లాగే చాలా మంది రెజ్ల‌ర్లు మొదట ఇదే స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నారు. అయితే వారు మా స్టాఫ్‌తో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 

ఒక్కరికి కూడా ఎలాంటి సమస్య రాలేదు. అయినా  టోర్నీలో పాల్గొన‌కుండా తాము ఎవ‌రిని అడ్డుకోవ‌డం లేదు. వినేశ్ ఇప్ప‌టికే త‌న రిజిస్ట్రేష‌న్‌ను పూర్తి చేసుకున్నారు. కానీ దీనిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మీడియాతో మాట్లాడే బదులు ఆమె రెజ్లింగ్‌పై దృష్టి సారిస్తే బాగుంటుంది.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక ఏషియ‌న్ గేమ్స్ సెప్టెంబ‌ర్‌లో, ఆ త‌ర్వాత అక్టోబ‌ర్‌లో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి.

2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ‌రువు ఎక్కువ ఉన్న కార‌ణంగా వినేశ్ ఫొగాట్‌ ప‌త‌కానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత వినేశ్ ఫొగాట్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. అయితే గ‌తేడాది డిసెంబ‌ర్‌లో త‌న రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకున్న వినేశ్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించింది.

చదవండి: ‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్‌ అయ్యర్‌ కీలక వ్యాఖ్యలు!

Advertisement
 
Advertisement
Advertisement