ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబిజీగా గడపడనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. కాగా అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్ ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజులకే ప్రారంభం కానుంది.
దీంతో ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సీనియర్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌ల దృష్ట్యా భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పరిధిలోకి రాదు. కాబట్టి సీనియర్లను ఈ మ్యాచ్‌లో రిస్క్ తీసుకోకడదని మేనెజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం టెస్టులకే పరిమితమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. అఫ్గానిస్తాన్‌తో టెస్టులో భారత జట్టును నడిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రిషబ్ భారత తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్‌కు అతడు ఎంపికయ్యే సూచనలు కన్పించడం లేదు. దీంతో అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్‌లో అతడికి జట్టు పగ్గాలను అప్పగించేందుకు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. అప్పటివరకు పంత్‌కు విశ్రాంతి లభించనుంది. ఒకవేళ అతడు భారత వన్డే జట్టుకు ఎంపికైన తుది జట్టులో మాత్రం చోటు కష్టమే. పంత్ ఇప్పటివరకు భారత్ కెప్టెన్‌గా ఆరు మ్యాచ్‌లలో వ్యవహరించాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. అఫ్గాన్ టెస్టు మ్యాచ్‌కు దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో గుర్నూర్ బ్రార్ (ఫాస్ట్ బౌలర్), మానవ్ సుతార్ (స్పిన్నర్), హర్ష్ దూబే, ఆకిబ్ నబీ (ఫాస్ట్ బౌలర్), దేవ్ దత్ పడిక్కల్(బ్యాటర్) ఉన్నారు.
"ఐపీఎల్ ఫైనల్‌కు అఫ్గానిస్తాన్ టెస్టుకు మధ్య పెద్దగా గ్యాప్ లేదు. కాబట్టి ఆటగాళ్లు వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అఫ్గాన్‌తో వన్డే సిరీస్, ఇంగ్లండ్ వైట్‌బాల్ సిరీస్‌లు భారత్‌కు ఉన్నాయి. అఫ్గానిస్తాన్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు.
భారత టెస్టు జట్టులోని కొంతమంది సభ్యులు దాదాపు రెండు నెలల పాటు బిజీబిజీగా గడపనున్నారు. దీంతో వారికి అఫ్గాన్‌తో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. గుర్నూర్, మానవ్ సుత్తార్, పడిక్కల్, హర్ష్ దూబేలు సెలెక్టర్ల రాడార్‌లో ఉన్నారని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా అఫ్గాన్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పూర్ వేదికగా జరగనుంది.
చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్


