PSL: డేవిడ్‌ వార్నర్‌ సంచలన వ్యాఖ్యలు! | No Need For That: Warner Reply To Fan Asking Him To Leave PSL For IPL | Sakshi
Sakshi News home page

PSL: డేవిడ్‌ వార్నర్‌ సంచలన వ్యాఖ్యలు!

Apr 28 2026 12:13 PM | Updated on Apr 28 2026 12:35 PM

No Need For That: Warner Reply To Fan Asking Him To Leave PSL For IPL

ఒకప్పుడు ఐపీఎల్‌లో స్టార్‌గా వెలుగొందాడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానుల మనసులో అతడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్నర్‌ సైతం ఆరెంజ్‌ ఆర్మీని అంతే ప్రేమించాడు.

కెప్టెన్‌గా 2016లో సన్‌రైజర్స్‌కు ట్రోఫీ అందించిన వార్నర్‌.. ఆ తర్వాత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. క్రమక్రమంగా జట్టులో అతడి స్థానం గల్లంతైంది. బెంచ్‌కే పరిమితమై వాటర్‌బాయ్‌గానూ అతడు సేవలు అందించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆరెంజ్‌ ఆర్మీకి సోషల్‌ మీడియా ద్వారా అతడు దగ్గరగానే ఉన్నాడు.

తెలుగు పాటలకు రీల్స్‌ చేస్తూ
తెలుగు పాటలకు రీల్స్‌ చేస్తూ టాలీవుడ్‌ ప్రేక్షకుల అభిమానం కూడా చూరగొన్నాడు వార్నర్‌. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిన అతడు.. 2024లో చివరగా ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో వార్నర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించాడు వార్నర్‌. పీఎస్‌ఎల్‌-2026 ఆరంభంలో కరాచీ కింగ్స్‌ వరుస విజయాలు సాధించినా.. ఆ తర్వాత పరాజయాలతో చతికిలపడింది. ఫలితంగా గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

జట్టుగా మనం ఎంతో సాధించాము
ఈ నేపథ్యంలో జట్టును ఉద్దేశించి వార్నర్‌ ఉద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ‘‘మనం ఆశించిన ఫలితం రాలేదు. అయితే, ఆట పట్ల మన అంకితభావం, నిబద్ధత నాకు తెలుసు. జట్టుగా మనం ఎంతో సాధించాము.

కరాచీ అభిమానులకు ధన్యవాదాలు. మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ నిర్వాహకులకు కృతజ్ఞతలు. మాకు భద్రత కల్పించిన పోలీసులకూ థాంక్యూ. త్వరలోనే మళ్లీ కలుద్దాం’’ అంటూ కరాచీ కింగ్స్‌తో దిగిన ఫొటోలను వార్నర్‌ పంచుకున్నాడు.

పీఎస్‌ఎల్‌ వదిలేసి ఐపీఎల్‌కు రా
ఈ నేపథ్యంలో ఓ భారత నెటిజన్‌.. ‘‘నువ్వు పీఎస్‌ఎల్‌ వదిలేసి ఐపీఎల్‌లో పునరాగమనం చేయడం మంచిది’’ అని కామెంట్‌ చేశాడు. ఇందుకు వార్నర్‌ ఘాటుగా బదులిచ్చాడు.

వార్నర్‌ రిప్లై వైరల్‌
‘‘ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. గట్టిగానే కౌంటర్‌ ఇచ్చావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు భారత నెటిజన్లు సైతం కౌంటర్లు ఇస్తున్నారు.

‘‘ఆటకు స్వస్తి చెప్పిన తర్వాత వార్నర్‌ ఐపీఎల్‌ కోచ్‌గా వస్తాడే కానీ.. పీఎస్‌ఎల్‌లో ఉండడు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టే అక్కడ ఉన్నాడు’’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా వార్నర్‌ ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడి 6565 పరుగులు చేశాడు.

చదవండి: ఆ పోలీస్‌ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement