డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి అదరగొట్టింది. ఐపీఎల్-2026లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. ఆతిథ్య జట్టును 75 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ.. వికెట్ నష్టపోయి కేవలం 39 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.
భువీ, హాజిల్‌వుడ్ విశ్వరూపం
తద్వారా ఈ సీజన్‌లో ఆర్సీబీ ఎనిమిదింట ఆరో విజయం నమోదు చేసింది. ఢిల్లీతో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భువీ మూడు ఓవర్లలో కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చగా.. హాజిల్‌వుడ్ 3.3 ఓవర్లలో 12 రన్స్ ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
రొమారియో షెఫర్డ్ మాత్రం
మిగిలిన వారిలో రసిఖ్ సలామ్ ధర్, సూయశ్ శర్మ, కృనాల్ పాండ్యా (Krunal Pandya) తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఓవైపు వీళ్లంతా అదరగొడితే.. ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ మాత్రం రెండు ఓవర్లలోనే 21 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
జట్టుకు భారంగా
గతేడాది ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంలో రొమారియో షెఫర్డ్ తన వంతు పాత్ర పోషించాడు. బ్యాట్, బంతితో రాణించి జట్టు తొలిసారి ట్రోఫీ గెలిచేందుకు సాయపడ్డాడు. కానీ ఈ సీజన్‌లో మాత్రం షెఫర్డ్ తేలిపోతున్నాడు. ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్ ఆడి కేవలం 39 పరుగులు చేసిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. కేవలం మూడు వికెట్లు తీశాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ రొమారియో షెఫర్డ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అతడు దండుగ అని.. కేవలం అదృష్టంగా భావించి మాత్రమే తుదిజట్టులో చోటు ఇస్తున్నారని చిక్కా అభిప్రాయపడ్డాడు.
తుదిజట్టులో చోటు దండుగ
ఈ మేరకు.. ‘‘ఆర్సీబీ బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది. అయితే, అందరిలోకెళ్లా రొమారియో షెఫర్డ్ ఒక్కడే వీక్ లింక్. అసలు ఆర్సీబీ అతడిని తుదిజట్టులో ఎందుకు ఆడిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు.
బహుశా అతడిని లక్కీ చార్మ్‌గా భావిస్తున్నట్లున్నారు. గతేడాది.. తొలిసారిగా ట్రోఫీ గెలిచినపుడు అతడు జట్టులోనే ఉన్నాడు కదా!.. కాబట్టి కేవలం అదృష్టం కోసం మాత్రమే అతడిని ఆడిస్తున్నారు. లేదంటే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడికి చోటే దండుగ’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. కాగా వెస్టిండీస్ స్టార్ రొమారియో షెఫర్డ్‌ను ఆర్సీబీ రూ. 1.5 కోట్లకు రిటైన్ చేసుకుంది.


