సిక్సర్ల వీరుడని బిల్డప్‌.. టీమిండియాకు ఆడుతున్నాడు కానీ! | Its been 2 years since he scored impactfully: Kris Srikkanth slams India star | Sakshi
Sakshi News home page

సిక్సర్ల వీరుడని బిల్డప్‌.. రెండేళ్లుగా చెత్త ప్రదర్శన: భారత మాజీ కెప్టెన్‌

Apr 27 2026 3:25 PM | Updated on Apr 27 2026 3:34 PM

Its been 2 years since he scored impactfully: Kris Srikkanth slams India star

ఐపీఎల్‌-2026లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్‌లో ఎనిమిదింట ఐదో పరాజయం నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గై​క్వాడ్‌ (60 బంతుల్లో 74 నాటౌట్‌) ఒక్కడే మెరుగైన స్కోరు సాధించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ శివం దూబేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

సిక్సర్ల వీరుడని బిల్డప్‌
‘‘శివం దూబే పరుగులు రాబట్టలేక సతమతమవుతున్నాడు. సిక్సర్ల దూబేగా అతడికి బాగా ప్రచారం కల్పించారు. కానీ అతడు ఐపీఎల్‌లో ప్రభావంతమైన ఇన్నింగ్స్‌ ఆడి దాదాపుగా రెండేళ్లు గడిచిపోయింది. కేవలం స్పిన్‌ బౌలింగ్‌లో మాత్రమే హిట్టింగ్‌ ఆడేవాడిగా ఉండిపోవద్దు దూబే.

టీమిండియాకు ఆడుతున్నాడు కానీ..
నిజానికి అంతర్జాతీయ క్రికెట్‌లో దూబే అద్బుతంగా ఆడుతున్నాడు. కానీ ఐపీఎల్‌లో తేలిపోతున్నాడు. ఈసారి ఐపీఎల్‌లో అతడు విఫలం కావడం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు పెద్ద సమస్యగా పరిణమించింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పేర్కొన్నాడు.

కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు దూబే. ఈ సీజన్‌లో ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా కేవలం 150 పరుగులు సాధించాడు.

రుతు ఒక్కడే
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. బౌలర్ల క్రమశిక్షణకు టాపార్డర్‌ మెరుపులు తోడవడంతోగుజరాత్‌ టైటాన్స్‌ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. 

సొంతమైదానం చెపాక్‌ వేదికగా టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (60 బంతుల్లో 74 నాటౌట్‌) ఎట్టకేలకు అర్ధశతకం సాధించగా... మిగతావాళ్లు విఫలమయ్యారు.

సాయి అదరగొట్టేశాడు
గుజరాత్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కగిసో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... అర్షద్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. 

సాయి సుదర్శన్‌ (46 బంతులలో 87; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) దుమ్మురేపగా... కెప్టెన్‌శుబ్‌మన్‌ గిల్‌ (23 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు), బట్లర్‌ (30 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అతడికి అండగా నిలిచారు. చెన్నై బౌలర్లలో అకీల్, నూర్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

చదవండి: Virender Sehwag: వైభ‌వ్, శ్రేయ‌స్ కాదు.. ఎవ‌రికీ టీమిండియాలో చోటు లేదు

Advertisement
 
Advertisement
Advertisement