ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇరాన్ ఆధిపత్యం
ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్ విభాగాల్లో టీమ్ టైటిల్స్ సొంతం
ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఆరు కాంస్యాలు హస్తగతం
ఒకవైపు స్వదేశంలో భీకర యుద్ధం... మరోవైపు క్రీడాంగణంలో ఇరాన్ మల్లయోధుల ఆధిపత్యం... అన్ని ప్రతికూలతలను అధిగమించి ఇరాన్ రెజ్లర్లు మరోసారి ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండించారు. ఈ మెగా ఈవెంట్‌కు సన్నద్ధమవుతున్న దశలో ఇరాన్‌లో యుద్ధం జరుగుతోంది. అయినప్పటికీ దాని ప్రభావం పడకుండా ఇరాన్ రెజ్లర్లు కిర్గిస్తాన్ రాజధాని బిష్‌కెక్‌లో గతవారం ముగిసిన ఆసియా చాంపియన్‌షిప్‌లో ఏకంగా 18 పతకాలు సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. దాంతో ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్ స్టయిల్‌లో ఇరాన్‌కే టీమ్ టైటిల్స్ లభించాయి. ప్రాణభయం వెంటాడుతున్నా అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ మల్లయోధులు తమ జెండా రెపరెపలాడించిన తీరుపై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడావిభాగం
‘ఈ పతకం నాకు ఎంతో ప్రత్యేకం. నా దేశం ఉన్న పరిస్థితుల్లో దీన్ని సాధించడం అత్యంత సంతృప్తికరం. గతంలో ఎన్నో పతకాలు గెలిచినా దీని స్థానం వాటన్నింటికంటే ఎక్కువ’ ఇది ఇరాన్ స్టార్ రెజ్లర్ అమీర్ హుస్సేన్ జారే చేసిన వ్యాఖ్య. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సహా అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన అమీర్ హుస్సేన్... ఆసియా చాంపియన్‌షిప్‌లో సాధించిన పతకానికి అంత ప్రత్యేక స్థానం ఇవ్వడం వెనక... ఇరాన్ ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఉంది.

పురుషుల 125 కేజీల ఫ్రీస్టయిల్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత అమీర్ భావోద్వేగానికి గురవుతూ తన జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఒకవైపు దేశంలో ఎక్కడ చూసిన బాంబు దాడులు, మిస్సైల్ మోతలతో దద్దరిల్లుతున్నా... ఇరాన్ రెజ్లర్లు మాత్రం ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తమ ఆధిపత్యాన్ని వదులుకోలేదు. స్టేడియంపై బాంబుదాడితో ప్లేయర్లంతా పారిపోవాల్సిన పరిస్థితులు ఎదురైనా... ప్రాక్టీస్ వదలని ఇరాన్ రెజ్లర్లు ఈ పోటీల్లో తమ పోరాట పటిమతో పాటు గుండెధైర్యాన్ని సైతం ప్రపంచానికి చాటారు.

సందిగ్ధత మధ్యే...
ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై తీవ్ర సందిగ్ధత మధ్య అరకొర ప్రాక్టీస్‌తోనే ఇరాన్ రెజ్లర్లు ఈ టోర్నీ బరిలోకి దిగారు. ‘ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. శిక్షణపై దృష్టి కేంద్రీకరించడం పక్కన పెడితే... కనీసం సురక్షితంగా ఉంటే చాలు అనుకోవాల్సిన స్థితి. బాంబు దాడుల్లో ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన మధ్య మా రెజ్లర్లు సాధనపై మనసు లగ్నం చేయలేకపోయారు. ఒకవైపు రెజ్లర్లు సురక్షితంగా ఉండటం... మరోవైపు వారి కుటుంబాల క్షేమంపై ఆందోళన వెరసి ప్రాక్టీస్ అంతంతమాత్రంగానే సాగింది’ అని పెజ్మాన్ చెప్పారు.

ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇరాన్ రెజ్లర్లు సత్తా చాటడం వెనక టీమ్ స్పిరిట్ దాగి ఉంది. కష్టకాలంలో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ... ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగారు. అందుకు తగ్గ ఫలితం సాధించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కంటే... తమ పోరాటం పెద్దది కాదని ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ దేశ ప్రజల కోసం ఏదో సాధించాలనే తపనను పతకాల సాధనలో చూపెట్టారు.
రోడ్డు మార్గం ద్వారా...
ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రెజ్లర్లు కిర్గిస్తాన్‌లోని బిష్‌కెక్‌కు వెళ్లాల్సి ఉండగా... బాంబుదాడులతో అంతర్జాతీయ విమానాశ్రయం ధ్వంసం కావడంతో రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దాదాపు 22 గంటల పాటు బస్సులో ప్రయాణించిన అనంతరం రెజ్లర్లు పోటీలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ‘మా దేశంలో రెజ్లింగ్ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది.
లాంటి దాడులకు భయపడి మా అస్థిత్వాన్ని కోల్పోకూడదని భావించాం. అందుకే ఎంత కష్టమైనా ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. దీని కోసం మా కోచ్‌లు మా కన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. దేశంపై మాకు ఎంతో ప్రేమ ఉంది. అదే మమ్మల్ని ఇక్కడి వరకు చేర్చింది. మ్యాట్‌పై అడుగు పెట్టిన ప్రతిసారి దేశ ప్రజలు నా వెంట ఉన్నారనే భావన కలుగుతుంది. అదే నాకు మరింత బలాన్ని ఇస్తుంది. ఈ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం అని కర్తవ్య బోధ చేసినట్లు అనిపిస్తుంది.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగినా మా దేశాన్ని ప్రేమించడం మాత్రం వదలం. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఎంతో మంది చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా అణచివేతను ఖండించాల్సిందే’ అని స్వర్ణం గెలిచిన అనంతరం అమీర్ హుసేన్ వెల్లడించాడు.
‘మైదానంపై దాడి హేయమైన చర్య’
తమ అస్థిత్వంపై జరిగిన ఈ దాడిని ఇరాన్ రెజ్లర్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ‘మీరు ఎంత ధనవంతులైనా, ఎంత బలీయులైనా... మరొకరిపై మీ శక్తిని ప్రయోగించాల్సిన అవసరం లేదు. మేము ఇరాన్ వాసులం. మా దేశంలో చిన్న భూభాగాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా లేము. మా దేశంపై దాడి చేసిన తర్వాత బదులివ్వకుండా ఎలా ఉంటాం. దేశ సరిహద్దులు క్షేమంగా ఉండాలని కోరుకోవడం ప్రతి పౌరుడి హక్కు. ఈ యుద్ధంలో ఇరాన్ తప్పక విజయం సాధిస్తుంది’ అని అమీర్ అన్నాడు.
తమ మనసులోని మాటలను ప్రపంచం ముందు పెట్టడానికి ఈ టోర్నమెంట్ బాగా ఉపయోగపడిందని ఇరాన్ రెజ్లర్లు పేర్కొన్నారు. ‘ఐదు ప్రపంచకప్‌లు నిర్వహించిన ఆజాది మైదానంపై దాడి చేయడం హేయమైన చర్య. యుద్ధంలో ఇలాంటి స్థలాలపై దాడులు చేయడం సబబు కాదు. అయినా వారు మా గుండెధైర్యాన్ని దెబ్బకొట్టలేరు. ఆ స్టేడియం తిరిగి నిచ్చించుకుంటాం’ అని కోచ్ పెజ్మాన్ అన్నాడు.
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇరాన్ పతక వీరులు
ఫ్రీస్టయిల్ విభాగం: మిలాద్ జహంగీర్ (స్వర్ణం; 57 కేజీలు), అహ్మద్ మసూద్ (కాంస్యం; 61 కేజీలు), సినామెహదీ ఖలీలి (కాంస్యం; 70 కేజీలు), అమీర్ మొహమ్మద్ (కాంస్యం; 74 కేజీలు), కామ్రాన్ ఘసెమ్‌పూర్ (స్వర్ణం; 86 కేజీలు), మొహమ్మద్ మోబిన్ (స్వర్ణం; 92 కేజీలు), అమీర్ హమీద్ అజార్‌పిరా (రజతం; 97 కేజీలు), అమీర్ హుస్సేన్ అబ్బాస్ జారే (స్వర్ణం; 125 కేజీలు).

గ్రీకో రోమన్ విభాగం: మొహమ్మద్ హాజీ అలీ (కాంస్యం; 55 కేజీలు), అలీ అబ్దుల్లా అహ్మదీ వఫా (కాంస్యం; 60 కేజీలు), ఇర్ఫాన్ బెహ్నామ్ జర్కానీ (రజతం; 63 కేజీలు), అహ్మద్ రెజా సైఫుల్లా (కాంస్యం; 67 కేజీలు), మొహమ్మద్ జావద్ సాదత్ (రజతం; 72 కేజీలు), అలీ జబీహుల్లా (రజతం; 77 కేజీలు), మొహమ్మద్ ఆమీన్ (రజతం; 82 కేజీలు), గులాం రెజా (రజతం; 87 కేజీలు), మొహమ్మదాదీ అబ్దుల్లా సరావి (స్వర్ణం; 97 కేజీలు), ఆమీన్ మీర్జాజాదే (స్వర్ణం; 130 కేజీలు).
స్టేడియంపై బాంబు దాడి
అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో ఇరాన్ అతలాకుతలం అయ్యింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా... లక్షలాది మంది తమ ఆనందమయ జీవనానికి దూరమయ్యారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధం ప్రభావం రెజ్లర్లపై కూడా పడింది. ఆసియా చాంపియన్‌షిప్‌నకు ముందు ఇరాన్ రెజ్లర్లు పాల్గొనాల్సిన జాతీయ శిబిరంపై బాంబు దాడి జరిగింది. దీంతో క్యాంప్‌ను టెహ్రాన్ నుంచి మరో నగరమైన మజందరాన్‌కు మార్చాల్సి వచ్చింది.
ఇరాన్ రెజ్లింగ్‌కు కేంద్ర బిందువైన టెహ్రాన్‌లోని ఆజాది ఇండోర్ స్టేడియం బాంబుదాడిలో పూర్తిగా ధ్వంసమైంది. ఒకప్పుడు వేలాది మంది అభిమానులు కూర్చొని మ్యాచ్‌లు వీక్షించిన మైదానం సిమెంట్ దిబ్బలా మారిపోయింది. ‘ఇది చాలా కఠినమైన పరిస్థితి. మా ప్లేయర్లు ప్రాక్టీస్ చేసే టెహ్రాన్ స్టేడియం బాంబు దాడికి గురైంది. మాపై బలవంతంగా మోపిన ఈ యుద్ధం... శిక్షణ కేంద్రాన్ని పూర్తిగా దెబ్బతీసింది’ అని ఇరాన్ రెజ్లింగ్ కోచ్ పెజ్మాన్ దొరోస్తాకర్ అన్నారు.


