ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.
వాస్తవానికి గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే చివరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకొని వారిని కట్టడి చేశారు. ఛేదన సమయంలోనూ గుజరాత్‌కు పైచేయి సాధించే అవకాశం ఉండింది. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీయగలిగినా, ఆతర్వాత ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయింది. చివరికి మూల్యం చెల్లించుకుంది.
మ్యాచ్ అనంతరం గిల్ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకున్నాడు. అతని మాటల్లో.. పవర్‌ప్లే ముగిసే సమయానికి మంచి స్థితిలో ఉన్నాం. కానీ, 16 నుంచి 19వ ఓవర్ వరకు ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోయాము. ఆ మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.
మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాం
ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలంటే మధ్య ఓవర్లలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అయితే, పవర్‌ప్లే తర్వాత మా బౌలర్లు ఆ పనిని చేయలేకపోయారు. ఆ సమయంలో కొన్ని మంచి బంతులు వేసినా, అవసరమైన స్థాయిలో లెంగ్త్‌ను మెయిన్‌టైన్ చేయలేకపోయారు.
సుతార్‌కు బంతి ఇవ్వడంపై వివరణ
పిచ్ స్పిన్‌కు సహకరిస్తోందని తాను బ్యాటింగ్ చేసే సమయంలోనే గమనించాను. ముఖ్యంగా కృనాల్ వేసిన బంతులు బాగా టర్న్ అయ్యాయి. అందుకే చివర్లో మానవ్ సుతార్‌కు అవకాశం ఇచ్చాను.మరో రెండు వికెట్లు పడుంటే మ్యాచ్ మళ్లీ తమవైపు తిరిగేది.
సాయి సుదర్శన్‌పై సరదా వ్యాఖ్య
సాయి ఇటీవల రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచినా, ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. అతని ప్రదర్శనపై గిల్ ప్రశంసలు కురిపించాడు. వచ్చే మ్యాచ్‌లో అయినా సాయి తనకు పవర్‌ప్లేలో స్ట్రైక్ ఇస్తాడని ఆశిస్తున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.


