అదే మా కొంపముంచింది.. సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి అనంతరం రియాన్‌ పరాగ్‌ | IPL 2026: RR Captain Riyan Parag Comments after losing to SRH | Sakshi
Sakshi News home page

అదే మా కొంపముంచింది.. సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి అనంతరం రియాన్‌ పరాగ్‌

Apr 26 2026 7:52 AM | Updated on Apr 26 2026 7:52 AM

IPL 2026: RR Captain Riyan Parag Comments after losing to SRH

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. వైభవ్‌ సూర్యవంశీ (103) శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా, సన్‌రైజర్స్‌ ఇషాన్‌ కిషన్‌ (74), అభిషేక్‌ శర్మ (57) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌ రాయల్స్‌ను వెనక్కు నెట్టి (నాలుగో స్థానానికి) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఇలా స్పందించాడు.

భారీ స్కోరు చేసినప్పటికీ, క్యాచ్‌లు వదిలేయడం జట్టుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నైపుణ్య పరంగా చూస్తే మేం బాగా ఆడాం. కానీ కీలక సమయంలో చాలా క్యాచ్‌లు వదిలేశాం. అభిషేక్‌ శర్మ లాంటి నాణ్యమైన ఆటగాళ్లకు రెండో అవకాశం ఇస్తే, అతను దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు. అదే జరిగింది.

228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, ఇంకా 10 నుంచి 15 పరుగులు వెనుకపడ్డాం. చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో పరుగులను నియంత్రించారు.

బౌలింగ్ మార్పులపై వివరణ ఇస్తూ.. ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో తాను, మరో స్పిన్నర్ కలిసి వికెట్ కోసం ప్రయత్నించాం. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా లేకపోవడంతో మా ప్రణాళిక ఫలించలేదు.

ఆర్చర్‌ ప్రదర్శన చాలా అద్భుతం. ఈ సీజన్ అంతా అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా క్లాసిక్ స్పెల్ వేశాడు. కొన్ని టాప్ ఎడ్జ్‌లు ఫీల్డర్ల మధ్య పడటం అతని దురదృష్టం.

తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఎదుర్కొననుండటంపై స్పందిస్తూ.. ప్రతి వేదిక కొత్త సవాల్. చండీగఢ్ పిచ్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం సిద్ధం చేసుకుంటాము.

ఒక రోజు విరామం ఉంది. మానసికంగా ఫ్రెష్ అయి, తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఫీల్డింగ్‌ వైఫల్యాలను అధిగమిస్తే రాజస్థాన్ రాయల్స్ మరింత ప్రమాదకర జట్టుగా మారడం ఖాయమని రియాన్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ ఓటమికి ఫీల్డింగ్‌ వైఫల్యాలు, క్యాచ్‌లు జారవిడచడమే ప్రధాన కారణమైనప్పటికీ.. బ్యాటింగ్‌లో లోపాలు సైతం గమినించదగ్గవే. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఇంకా భారీ స్కోర్‌ చేసుండాల్సింది. సూర్యవంశీ క్రీజ్‌లో ఉన్నంత సేపు సునాయాసంగా 250 ప్లస్‌ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔటైన వెంటనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. 

ఫెరియెరా మెరుపులు మినహా మధ్య వరుస బ్యాటర్లెవ్వరూ రాణించలేదు. అలాగే ఈ మ్యాచ్‌లో రియాన్‌ కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. స్ట్రయిట్‌ స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, రవీంద్ర జడేజాతో తలో ఓవర్‌ మాత్రమే వేయించి మూల్యం చెల్లించుకున్నాడు. మొత్తంగా ఈ ఓటమితో రాయల్స్‌ చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement