చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. ఐపీఎల్‌లో ఒకే ఒక్కడు | IPL 2026: Rashid Khan Creates History Becomes 1st Player In IPL To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. ఐపీఎల్‌లో ఒకే ఒక్కడు

Apr 27 2026 11:02 AM | Updated on Apr 27 2026 11:26 AM

IPL 2026: Rashid Khan Creates History Becomes 1st Player In IPL To

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో పద్దెమినిదేళ్లుగా ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 2017లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.

144వ మ్యాచ్‌
దాదాపు ఆరేళ్ల పాటు సన్‌రైజర్స్‌తో కొనసాగిన రషీద్‌ ఖాన్‌ (Rashid Khan).. 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో చేరాడు. అప్పటి నుంచి గుజరాత్‌కే ఆడుతున్న ఈ స్పిన్‌ బౌలర్‌... ఐపీఎల్‌-2026లో ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భాగమయ్యాడు. తద్వారా ఐపీఎల్‌లో తన 144వ మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు రషీద్‌ ఖాన్‌.

ఏకైక ఆటగాడిగా రషీద్‌
కాగా అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి దాకా రషీద్‌ ఖాన్‌ ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాలేదు. తద్వారా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాకుండా.. అత్యధికంగా 144 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా రషీద్‌ రికార్డులకెక్కాడు. తద్వారా భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

రైనా రికార్డు బద్దలు
కాగా రైనా ఐపీఎల్‌లో మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 2008లో అరంగేట్రం చేసిన అతడు 2016లో తొలిసారి మ్యాచ్‌ మిస్‌ అయ్యాడు. తనకు కూతురు జన్మించిన సందర్భంగా అతడు జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అప్పుడు రైనా గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. నాడు ఆర్సీబీతో మ్యాచ్‌ అతడు మిస్సయ్యాడు.

గుజరాత్‌ అలవోకగా..
మ్యాచ్‌ విషయానికొస్తే.. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చచ్చీ చెడి 158 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్ల ధాటికి 12 ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ దాటిన సూపర్‌ కింగ్స్‌... 16వ ఓవర్‌లో మూడంకెల స్కోరు అందుకుంది. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ ముందు ఈ లక్ష్యం మరీ చిన్నదైపోయింది. 

గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్‌ మరోసారి దంచికొట్టడంతో 20 బంతులు మిగిలుండగానే టైటాన్స్‌ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ వికెట్లేమీ తీయలేకపోయాడు. ఒక్క ఓవర్లోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చుకున్నాడు.    

ఐపీఎల్‌లో అరంగేట్రం నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాకుండా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు
🏏రషీద్‌ ఖాన్‌- 144 మ్యాచ్‌లు- 2017-2026*- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌
🏏సురేశ్‌ రైనా- 143 మ్యాచ్‌లు- 2008-2016- చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ లయన్స్‌  
🏏యూసఫ్‌ పఠాన్‌- 95 మ్యాచ్‌లు- 2008-2014- రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌
🏏సుబ్రమణ్యం బద్రీనాథ్‌- 74 మ్యాచ్‌లు- 2008-2012- చెన్నై సూపర్‌ కింగ్స్‌
🏏జితేశ్‌ శర్మ- 62 మ్యాచ్‌లు- 2022-2026*- పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.

చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం

Advertisement
 
Advertisement
Advertisement