ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ బ్యాటర్లు తడబడినా, బౌలర్లు అద్భుతంగా రాణించి తమ జట్టును గెలిపించారు.
ఆర్చర్ (4-1-20-3), బర్గర్ (4-0-27-2), బ్రిజేష్ శర్మ (3-0-18-2), జడేజా (4-0-29-1), బిష్ణోయ్ (3-0-23-1) సత్తా చాటడంతో రాయల్స్ 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. లక్నో తరఫున మిచెల్ మార్ష్ (55) ఒంటరిపోరాటం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ జట్టు టాప్-4లో ఏకంగా ముగ్గురు (బదోని, పంత్, మార్క్రమ్) డకౌటయ్యారు.
మ్యాచ్ అనంతరం జట్టు ప్రదర్శనపై రాయల్స్ సారధి రియాన్ పరాగ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ, బౌలర్ల అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నామని అన్నాడు. పిచ్ పరిస్థితిని బట్టి 180 పరుగులు చేసుండాల్సిందని అభిప్రాయపడ్డారు.
పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్నారు
గత 2-3 మ్యాచ్‌ల్లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ కాస్త నెమ్మదించారన్న అంశంపై స్పందిస్తూ.. అది వ్యూహాత్మక మార్పు కాదని, పిచ్‌కు అనుగుణంగా ఆడుతున్నారని తెలిపాడు. పరిస్థితులను అంచనా వేసి, అందుకు తగ్గట్టు ఆడటమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఫ్లాట్ పిచ్ ఉంటే దూకుడుగా ఆడతారు. కఠిన పరిస్థితుల్లో సమయం తీసుకుంటారని చెప్పాడు.
బౌలర్లపై ప్రశంసలు
ఈ విజయం బౌలర్ల ప్రదర్శన వల్లే దక్కిందని అన్నాడు. ఆర్చర్, బర్గర్‌లను ప్రత్యేకంగా ప్రశంసించాడు. వారు పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబునిచ్చాడు. తన వ్యక్తిగత ఫామ్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం దుర్దశను ఎదుర్కొంటున్నట్లు అభిప్రాయపడ్డాడు.
త్వరలోనే మంచి ఇన్నింగ్స్ ఉంటుంది
ఇలాంటి సమయంలో జట్టు నన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తోందని తెలిపాడు. తన ఆటపై విశ్వాసం వ్యక్తం చేశాడు. త్వరలోనే మంచి ఇన్నింగ్స్ ఆడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత గణాంకాలకంటే జట్టు అవసరాలే ముఖ్యమని స్పష్టం చేశాడు. జట్టు ఎలా కోరుకుంటే అలా ఆడతా. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడమంటే అలాగే ఆడతా. నెమ్మదిగా ఆడమంటే కూడా సిద్ధమే అని అన్నాడు.


