ఉత్కంఠ పోరు.. ఢిల్లీని గెలిపించిన డేవిడ్‌ మిల్లర్‌ | IPL 2026: Miller takes Delhi to penultimate-ball win | Sakshi
Sakshi News home page

IPL 2026: ఉత్కంఠ పోరు.. ఢిల్లీని గెలిపించిన డేవిడ్‌ మిల్లర్‌

Apr 18 2026 8:11 PM | Updated on Apr 18 2026 8:22 PM

 IPL 2026: Miller takes Delhi to penultimate-ball win

ఐపీఎల్‌-2026 వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో  ఫిల్‌ సాల్ట్‌(63) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

మిల్లర్‌.. కిల్లర్‌
అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే భారీ షాకిచ్చాడు. భువీ ధాటికి ఢిల్లీ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్‌(57), ట్రిస్టన్ స్టబ్స్‌(60 నాటౌట్‌) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రాహుల్ ఔటయ్యాక ఆర్సీబీ తిరిగి గేమ్‌లోకి వచ్చింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌(26 రిటైర్డ్ హార్ట్‌) భారీ షాట్ల ఆడడంలో విఫలమయ్యాడు.

అతడితో పాటు స్టబ్స్ కూడా కాస్త నెమ్మదించాడు. దీంతో ఢిల్లీ కావాల్సిన రన్‌రేట్ పెరుగుతూ వచ్చింది. అయితే అక్షర్ పటేల్ తొడ కండరాలు పట్టేయంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన మిల్లర్ కూడా బంతిని స్ట్రైక్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. రషీక్ ధార్ సలాం వేసిన 19 ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులగా మారింది.

ఆర్సీబీ కెప్టెన్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను రొమోరియా షెఫర్డ్‌కు అప్పగించాడు. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి నాలుగు బంతుల్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. వరుసగా మూడు, నాలుగు బంతులను భారీ సిక్సర్లగా మిల్లర్ మలిచాడు. 

ఐదో బంతిని బౌండరీ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. మిల్లర్ 10 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్‌ పాండ్యా ఓ వికెట్‌ సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Advertisement
 
Advertisement
Advertisement