Ind vs Eng: ఇక టెస్టు క్రికెట్‌ సమయం

India vs England 1st Test Match Today - Sakshi

నేటి నుంచి భారత్, ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌

ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ కోసం పోరు 

హోరాహోరీ సమరానికి అవకాశం

మధ్యాహ్నం గం. 3:30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

నాటింగ్‌హామ్‌: భారత ద్వితీయ శ్రేణి జట్టు ఇటీవల శ్రీలంకతో సిరీస్‌ ఆడినా స్టార్లు లేని ఆ జట్టు మ్యాచ్‌లు సగటు క్రికెట్‌ అభిమానులకు పెద్దగా ఆసక్తిని కలిగించలేదు. కొంత విరామం తర్వాత ఇప్పుడు సీనియర్‌ క్రికెటర్లు కీలక మ్యాచ్‌ కోసం బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మానసికంగా పైచేయి సాధించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.  

కేఎల్‌ రాహుల్‌కు చాన్స్‌... 
కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడిన లైనప్‌ను చూస్తే తొలి టెస్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. గాయపడిన శుబ్‌మన్‌ గిల్‌ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్‌లో ఆడిన 36 టెస్టుల్లో 5 సార్లు మినహా అన్ని సందర్భాల్లో రాహుల్‌ స్పెషలిస్ట్‌ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. తాజా ఫామ్‌ను పరిగణనలోకి తీసు కున్నా రాహుల్‌కే తొలి అవకాశం ఉంటుంది. రోహి త్‌ తనదైన శైలిలో దూకుడుగా ఆడగలడు. అయితే 3, 4, 5 స్థానాల బ్యాట్స్‌మెన్‌లో నిలకడ లోపించడం భారత్‌ను కొంత బలహీనంగా మారుస్తోంది. కోహ్లి కూడా భారీ స్కోరు సాధించడంలో విఫలమవుతుండగా... పుజారా, రహానే చెప్పుకోదగ్గ స్కోరు సాధించి చాలా కాలమైంది. వీరు రాణిస్తేనే భారత బ్యాటింగ్‌ పటిష్టంగా మారుతుంది. ముగ్గురు పేసర్లు బుమ్రా, ఇషాంత్, షమీలతో పాటు అశ్విన్‌ ఖాయం కాగా... జడేజాను కాకుండా నాలు గో పేసర్‌గా శార్దుల్‌ను తీసుకుంటారా చూడాలి.

స్యామ్‌ కరన్‌ కీలకం... 
ప్రతిష్టాత్మక సిరీస్‌కు బెన్‌ స్టోక్స్‌లాంటి స్టార్‌ ఆటగాడు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అయితే యువ ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌ ఆ స్థానంలో తన వంతు పాత్ర పోషించనున్నాడు.  అండర్సన్, బ్రాడ్‌లాంటి సీనియర్లతో పాటు రాబిన్సన్‌ మూడో పేసర్‌గా ఆడవచ్చు. ఇటీవల భారత పర్యటనకు వెళ్లి ఘోరమైన ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్‌మెన్‌ బర్న్స్, సిబ్లీ, క్రాలీలకు సొంతగడ్డపైనైనా రాణించి ఆకట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ప్రధాన బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిలో ఉన్న రూట్‌కు కూడా ఈ సిరీస్‌ కీలకం 
కానుంది.  

పిచ్, వాతావరణం 
ఆరంభంలో సీమ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలిగే సాధారణ ఇంగ్లండ్‌ తరహా పిచ్‌. కొంత పచ్చిక ఉన్నా, టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకోవచ్చు. 

జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా/శార్దుల్, షమీ, ఇషాంత్, బుమ్రా.  
ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), బర్న్స్, సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, బట్లర్, స్యామ్‌ కరన్, రాబిన్సన్, బ్రాడ్, లీచ్, అండర్సన్‌.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top