Ravichandran Ashwin: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్న అశ్విన్‌

IND VS AUS 1st Test: Ravi Ashwin One Wicket Away From 450 Wickets - Sakshi

BGT 2023: టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అత్యంత అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 88 మ్యాచ్‌ల్లో 449 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్‌లో ఒక్క వికెట్‌ తీస్తే 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

రవికి ముందు ముత్తయ్య మురళీథరన్‌ (800 వికెట్లు), షేన్‌ వార్న్‌ (708), జేమ్స్‌ ఆండర్సన్‌ (675), అనిల్‌ కుంబ్లే (619), స్టువర్ట్‌ బ్రాడ్‌ (566), మెక్‌గ్రాత్‌ (563), కోట్నీ వాల్ష్‌ (519), నాథన్‌ లయోన్‌ (460) ఈ ఘనత సాధించారు. ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో అశ్విన్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా స్పిన్నర్లు కూడా పలు మైలురాళ్లకు అత్యంత చేరువలో ఉన్నారు.

లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా మరో 8 వికెట్లు తీస్తే 250 వికెట్ల మైలురాయిని, మరో లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ అక్షర్‌ పటేల్‌ మరో 3 వికెట్లు తీస్తే 50 వికెట్ల క్లబ్‌లో చేరతారు. జడ్డూ ఇప్పటివరకు ఆడిన 60 టెస్ట్‌ల్లో 242 వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 47 వికెట్లు తీశాడు. ఇకపోతే టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మియా కూడా మరో 3 వికెట్లు పడగొడితే 50 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. సిరాజ్‌ 15 టెస్ట్‌ల్లో 46 వికెట్లు నేలకూల్చాడు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో భారత తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. జట్టు నిండా టాలెంటెడ్‌ ఆటగాళ్లు ఉండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాల్లో అర్ధం కాక మేనేజ్‌మెంట్‌ తలలు పట్టుకుంటుంది. సీనియర్లు కోహ్లి, రోహిత్‌, పుజారా, అశ్విన్‌, షమీ అలాగే యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ స్థానాలకు ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. మిగతా 5 స్థానాలకు తీవ్ర పోటీ నెలకొని ఉంది.

వికెట్‌కీపర్‌ కోటాలో శ్రీకర్‌ భరత్‌కు అవకాశం ఇవ్వాలా లేక కేఎల్‌ రాహుల్‌కే ఆ బాధ్యతలు అప్పజెప్పాలా అన్న సమస్య ఒకటైతే, స్పిన్నర్లలో (జడేజా, కుల్దీప్‌, అక్షర్‌) ఎవరిని ఆడించాలి, అలాగే పేసర్లలో (సిరాజ్‌, ఉమేశ్‌, ఉనద్కత్‌) ఎవరికి అవకాశం ఇవ్వాలి, సూర్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలా లేదా అన్న విషయాల్లో జట్టు యాజమాన్యం తర్ఝనభర్జన పడుతుంది. 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top