Suresh Raina: ముందు ధోని, ఆతర్వాతే దేశం.. సురేశ్‌ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు

I played for Dhoni, Then I Played For Country.. Suresh Raina Comments - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ధోని వైదొలిగిన నిమిషాల వ్యవధిలోనే (30 నిమిషాలు) తాను కూడా రిటైర్మెంట్‌ ప్రకటన చేయడంపై ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ రైనా ఇలా అన్నాడు. భారత జట్టుకు నేను ధోని కలిసి చాలా మ్యాచ్‌ల్లో ఆడాం. చాలా మ్యాచ్‌ల్లో జట్టును కలిసే గెలిపించాం.

ధోని లాంటి గొప్ప మనసున్న వ్యక్తితో కలిసి ఆడటం, అతని సారధ్యంలో జట్టు సభ్యుడిగా కొనసాగడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. నేనేమో ఘజియాబాద్‌ నుంచి వచ్చాను, ధోని రాంచీ నుంచి వచ్చాడు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన మేము అన్నదమ్ములా కలిసిపోయాం. ముందుగా నేను ధోని కోసమే ఆడాను, ఆ తర్వాతే దేశం కోసం. అది మా ఇద్దరి మధ్య అనుబంధం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సురేశ్‌ రైనా.

ఈ వ్యాఖ్యలు రైనా ఏ ఉద్దేశంతో చేశాడో కానీ, భారత క్రికెట్‌ అభిమానులు మాత్రం వీటిపై భిన్నంగా స్పందిస్తున్నారు. రైనా దేశాన్ని తక్కువ చేసి, ధోనిని హీరోగా ఊహించుకుంటున్నాడని కొందరంటుంటే.. మరికొందరు రైనా వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. మొత్తానికి రైనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

కాగా, 2020 ఆగస్ట్‌ 15న ధోని, రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ధోని సారధ్యంలో టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రైనా.. భారత జట్టు తరఫున 226 వన్డేల్లో 5615 పరుగులు చేశాడు. అలాగే టీ20 ఫార్మాట్‌లో 1605 పరుగులు చేశాడు. ధోని, రైనా ఇద్దరూ టీమిండియా తరఫున కలిసి ఆడటమే కాకుండా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున కూడా కలిసి ఆడారు.

మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరొందిన రైనా సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మధ్యలో ఓ సీజన్‌ (2016-17లో గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్‌గా రైనా) మినహాంచి 2021 ఐపీఎల్‌ వరకు ధోని, రైనాల జర్నీ కలిసే సాగింది. అయితే 2022 సీజన్‌లో రైనా అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడంతో ధోనిని వదిలి ఐపీఎల్‌ నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు.    

   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top