‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మ‌డం ఆపండి!’ | Ex-India Player Shows Support KL Rahul Decision Vs RCB | Sakshi
Sakshi News home page

‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మ‌డం ఆపండి!’

Apr 28 2026 6:09 PM | Updated on Apr 28 2026 6:26 PM

 Ex-India Player Shows Support KL Rahul Decision Vs RCB

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సోమ‌వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో దారుణ ఓట‌మిని చ‌విచూసింది. 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఢిల్లీ 9 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ విధ్వ‌సంక‌ర సెంచ‌రీతో పంజాబ్‌పై భారీ స్కోరు చేసిన‌ప్ప‌టికీ, ఆ మ్యాచ్‌ను కూడా కాపాడుకోవ‌డంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విఫ‌ల‌మైంది. 

అయితే పంజాబ్‌తో మ్యాచ్‌లో 152 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. అయితే కేఎల్ రాహుల్ స్ట్రైకింగ్ తీసుకోకుండా డెబ్యు ఆట‌గాడు సాహిల్ ప‌రాక్‌కు చాన్స్ ఇవ్వ‌డంపై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే కేఎల్ రాహుల్‌కు భార‌త మాజీ క్రికెటర్‌ దొడ్డ గ‌ణేశ్ అండ‌గా నిల‌బ‌డ్డాడు.  

‘ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్.. డెబ్యూ ఆట‌గాడు సాహిల్ ప‌రాక్‌కు స్ట్రైక్ ఇవ్వ‌డంపై కొంతమంది జ‌ర్న‌లిస్టులు విమ‌ర్శిస్తూ ట్వీట్లు చేశారు. అయితే సాహిల్ ప‌రాక్ టెయిలెండ‌ర్ కాదు, అత‌డొక బ్యాట‌ర్‌. అందుకే అత‌డిని ఓపెన‌ర్‌గా ఎంచుకున్నారు. ఈ విష‌యం తెలియ‌క రాహుల్‌ను అకార‌ణంగా తిడుతున్నారు. 

పిచ్ ప‌రిస్థితులపై అవ‌గాహ‌న‌లేమి ఢిల్లీ క్యాపిట‌ల్స్ దారుణ ఆట‌తీరుకు కార‌ణ‌మ‌య్యింది. కానీ కేఎల్ రాహుల్ ఏదో త‌ప్పు చేసిన‌ట్లు అంద‌రూ అత‌డిపై క్రూర‌త్వం ప్రద‌ర్శించ‌డమేంటనేది  నాకు అర్థం కావ‌డం లేదు. అత‌డిపై విషం చిమ్మ‌డం ఆపండి’ అని చెప్పు కొచ్చాడు.

మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. 

ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది.  ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. ఇక దొడ్డ గణేశ్‌ టీమిండియా తరఫున ఒక వన్డే, నాలుగు టెస్టులు ఆడాడు.

చదవండి: భార‌త్‌కు తప్పని చైనా గండం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement