టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి యుక్త వయసులో ఉన్నప్పుడు అతనితో కయ్యానికి కాలు దువ్విన ఓ ఇంగ్లీష్ క్రికెటర్ ఇప్పుడు అతని దేశ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో ముందున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన 37 ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ 2012లో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లీతో తీవ్రస్థాయిలో గొడవ పడ్డాడు.
ఆ సందర్భంగా కోహ్లి-ఫిన్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి వెళ్లింది. తనను రెచ్చగొట్టిన ఫిన్‌కు కోహ్లీ బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఫిన్ సైతం తనకు అవకాశం వచ్చినప్పుడు కోహ్లిని ఔట్ చేశాడు. వీరిద్దరి మధ్య వైరం అప్పట్లో కొంతకాలం సాగింది.
అయితే ఫిన్ 2023లో మోకాలి గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కామెంటేటర్ అవతరామెత్తాడు. ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు, 21 టీ20లు ఆడిన ఫిన్, కామెంటేటర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా ఫిన్ ఇంగ్లండ్ క్రికెట్‌లో అత్యంత కీలకమైన చీఫ్ సెలెక్టర్ పదవికి ప్రధాన పోటీదారుడిగా మారాడు. ఈ పదవి రేసులో ఫిన్ పేరు ప్రధానంగా వినినిస్తుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ లూక్ రైట్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత రైట్ తన పదవికి రాజీనామా చేశాడు.
ఈ క్రమంలో చీఫ్ సెలెక్టర్ పదవికి ఎన్నిక అనివార్యం కాగా.. ఫిన్‌తో పాటు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు డారెన్ గాఫ్, నిక్ నైట్ కూడా పోటీపడుతున్నారు. వీరిలో ఫిన్‌కు ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.
జూన్ 4న ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే కొత్త సెలెక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. తుది నిర్ణయం ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబర్ట్ కీ తీసుకోనున్నారు. ఇంగ్లండ్ చీఫ్ సెలెక్టర్ పదవికి సంవత్సరానికి సుమారు 150,000 పౌండ్ల వేతనం లభించనుంది.


