ధోని వల్లేనా?.. నోర్ముయ్‌.. ముందు నీ సంగతి చూసుకో! | Delhi Capitals Coach Badani Told To Shut Up Old Dhoni Fleming Dig | Sakshi
Sakshi News home page

ధోని వల్లేనా?.. నోర్ముయ్‌.. ముందు నీ సంగతి చూసుకో!

Apr 28 2026 3:47 PM | Updated on Apr 28 2026 4:04 PM

Delhi Capitals Coach Badani Told To Shut Up Old Dhoni Fleming Dig

ఫ్లెమింగ్‌- బదానీ (PC: BCCI/IPL)

ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయ పరంపర కొనసాగుతోంది.  సొంత మైదానం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఇటీవల పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది ఢిల్లీ. తాజాగా సోమవారం నాటి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఘోర పరాభవం పాలైంది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీకి ఐపీఎల్‌లో ఇది మూడో అత్యల్ప స్కోరు. అభిషేక్‌ పొరేల్‌ (33 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.

బ్యాటర్లకు చుక్కలు
‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోష్‌ హాజల్‌వుడ్‌ (4/12), భువనేశ్వర్‌ కుమార్‌ (3/5) అద్భుత బౌలింగ్‌తో క్యాపిటల్స్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అనంతరం బెంగళూరు 6.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో పాతుమ్‌ నిస్సాంక స్థానంలో ఢిల్లీ ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన సాహిల్‌ పరేఖ్‌కు చేదు అనుభవమే మిగిలింది.

ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఢిల్లీ హెడ్‌కోచ్‌ హేమంగ్‌ బదానీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ గురించి మాట్లాడిన బదానీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో చూడాలని ఉందన్నాడు.

నోర్ముయ్‌.. నీ సంగతి చూసుకో ముందు!
‘‘హేయ్‌ హేమంగ్‌.. ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీ జట్టు ఎలా ఆడుతుందో చూడు. ఆ తర్వాత వేరేవాళ్ల గురించి మాట్లాడు. ఎక్కువగా మాట్లాడేవాళ్లు పెద్ద గొప్పేమీ కాదని నేను తరచూ చెబుతూ ఉంటాను.

ఎంఎస్‌ ధోని వల్లే అతడు గెలిచాడా?
అయితే, బదానీ చాలా ఎక్కువగా మాట్లాడేస్తాడు. కానీ ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు అతడిని విమర్శిస్తున్నారు. నిజానికి నువ్వు ఇతరుల గురించి మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటే బాగుండేది. ఆరోజు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ గురించి ఏమన్నావో గుర్తుందా? ఎంఎస్‌ ధోని వల్లే అతడు గెలిచాడా?

మరి నువ్వేం చేశావు? ఏమీ లేదు కదా!.. అయినా పృథ్వీ షా ఉండగా.. కేఎల్‌ రాహుల్‌కు ఓపెనింగ్‌ జోడీగా సాహిల్‌ను తీసుకువస్తావా?’’ అంటూ చిక్కా మండిపడ్డాడు. కాగా క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రస్తావన ప్రకారం.. గతంలో హేమంగ్‌ బదానీ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ను ఉద్దేశించి..

ఫ్లెమింగ్‌ మంచి కోచ్‌ కాదు
‘‘ఫ్లెమింగ్‌ అంత పెద్ద కోచా? అలా అయితే, ఐపీఎల్‌ కాకుండా ఇతర టీ20 లీగ్‌లలో అతడు ఎందుకు విజయవంతం కావడం లేదు? ధోని వల్లే చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుస్తోంది. 

ఆ జట్టులో అంతా ధోనినే. ఫ్లెమింగ్‌ మంచి కోచ్‌ అని ఎవరైనా అంటే నేను మాత్రం అందుకు అస్సలు అంగీకరించను’’ అని అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిక్కా బదానీకి దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు.

చదవండి: PSL: డేవిడ్‌ వార్నర్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement