ఢిల్లీ ధమాకా | Delhi Capitals beat Bangalore by six wickets | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ధమాకా

Apr 19 2026 5:03 AM | Updated on Apr 19 2026 5:03 AM

Delhi Capitals beat Bangalore by six wickets

ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం

మెరిపించిన స్టబ్స్, రాహుల్, మిల్లర్‌  

బెంగళూరు: సొంతగడ్డపై ఈ ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు తొలి ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టును బోల్తా కొట్టించింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ... ఛేదనలో చివరి వరకు పోరాడి విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళురు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (38 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా... విరాట్‌ కోహ్లి (13 బంతుల్లో 19; 3 ఫోర్లు) సహా తక్కినవాళ్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్, ఎన్‌గిడి, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (47 బంతుల్లో 60 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. భువనేశ్వర్‌ (3/26) ధాటికి 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఈ జోడీ నిలబడి ఢిల్లీని ఆదుకుంది. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌ (10 బంతుల్లో 22 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.  

మిల్లర్‌ 6, 6, 4 
ఛేదనలో ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌ నాలుగో బంతికి నిసాంక (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న భువనేశ్వర్‌... ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. కరుణ్‌ నాయర్‌ (5) సమీర్‌ రిజ్వీ (2)లను పెవిలియన్‌ బాటపట్టించి ఢిల్లీని ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఈ దశలో స్టబ్స్‌తో కలిసి ‘బర్త్‌డే బాయ్‌’ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 

30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అనంతరం రాహుల్‌ అవుట్‌ కాగా... అక్షర్‌ పటేల్‌ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా... షెఫర్డ్‌ తొలి రెండు బంతులకు రెండు పరుగులే ఇచ్చాడు. ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో మిల్లర్‌ 6, 6, 4 కొట్టి జట్టును గెలిపించాడు.   

సాల్ట్‌ ఒక్కడే...  
అంతకుముందు ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తీరుకు... ముగిసిన విధానానికి పొంతనే లేదు. ఓపెనర్లు సాల్ట్, కోహ్లి ధాటిగా ఆడటంతో... 5 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్‌ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఆ తర్వాత కోహ్లి అవుట్‌ కాగా... దేవదత్‌ పడిక్కల్‌ (18), కెపె్టన్‌ రజత్‌ పాటీదార్‌ (8), టిమ్‌ డేవిడ్‌ (26), జితేశ్‌ శర్మ (14), షెఫర్డ్‌ (1), కృనాల్‌ పాండ్యా (12) పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

పేస్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఆర్‌సీబీ బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడ్డారు. అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ కట్టిపడేయడంతో పరుగుల రాక గగనమైంది. దీంతో ఒత్తిడికి గురైన ఆర్‌సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో ఆకుపచ్చ రంగు జెర్సీతో బరిలోకి దిగింది.  

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 63; కోహ్లి (సి) నిసాంక (బి) ఎన్‌గిడి 19; పడిక్కల్‌ (సి) మిల్లర్‌ (బి) అక్షర్‌ 18; పాటీదార్‌ (సి) రాహుల్‌ (బి) ముకేశ్‌ 8; డేవిడ్‌ (సి) నటరాజన్‌ (బి) అక్షర్‌ 26; జితేశ్‌ (సి) మిల్లర్‌ (బి) ఎన్‌గిడి 14; షెఫర్డ్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 1; కృనాల్‌ పాండ్యా (రనౌట్‌) 12; రసిక్‌ సలామ్‌ (నాటౌట్‌) 0; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–52, 2–99, 3–105, 4–131, 5–146, 6–149, 7–172, 8–172. బౌలింగ్‌: అఖీబ్‌ నబీ 3–0–36–0; ముకేశ్‌ 4–0–32–1; ఎన్‌గిడి 4–0–39–2; కుల్దీప్‌ 4–0–32–2; నటరాజన్‌ 2–0–16–0; అక్షర్‌ 3–0–18–2.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: నిసాంక (ఎల్బీ) (బి) భువనేశ్వర్‌ 1; కేఎల్‌ రాహుల్‌ (సి) కోహ్లి (బి) కృనాల్‌ 57; కరుణ్‌ నాయర్‌ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 5; సమీర్‌ రిజ్వీ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 2; స్టబ్స్‌ (నాటౌట్‌) 60; అక్షర్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 26; మిల్లర్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–2, 2–16, 3–18, 4–87. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–26–3; హాజల్‌వుడ్‌ 4–0–38–0; రసిక్‌ 4–0–40–0; కృనాల్‌ 4–0–24–1; సుయాశ్‌ 3–0–31–0; షెఫర్డ్‌ 0.5–0–17–0.

100
హోం గ్రౌండ్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఐపీఎల్‌ జట్టుగా ఆర్‌సీబీ గుర్తింపు పొందింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఏప్రిల్‌ 18న చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ మొదలైంది. ఈ వేదికపై మొదటి మ్యాచ్, 50వ మ్యాచ్, 100వ మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ జట్టుకు ఓటమి ఎదురుకావడం గమనార్హం. హోం గ్రౌండ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (ఈడెన్‌ గార్డెన్స్‌లో 98 మ్యాచ్‌లు), ముంబై ఇండియన్స్‌ (వాంఖడే స్టేడియంలో 95 మ్యాచ్‌లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement