అర్జున్ టెండుల్కర్ (PC: Instagram)
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌కు ఐపీఎల్‌లో ఈ ఏడాది కూడా కలిసి రావడం లేదు. గతేడాది వరకు అతడు ముంబై ఇండియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ జట్టు తరఫున అర్జున్ కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.
ఇక్కడా బెంచ్‌కే పరిమితం
అయితే, 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar)ను లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది. కానీ.. ముంబై ఇండియన్స్ మాదిరే ఇక్కడ కూడా ఈ ఆల్‌రౌండర్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఈ సీజన్‌లో లక్నో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా.. అర్జున్‌కు ఒక్కసారి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు.
అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయం
ఇక ఇప్పటికి ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా ఆరు ఓడి లక్నో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లక్నో జట్టులో ఆడే పరిస్థితి లేని తరుణంలో టీ20 ముంబై లీగ్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు జర్నలిస్టు గౌరవ్ గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రూ. 5 లక్షల కనీస ధరతో
కాగా మే 2న ముంబైలో టీ20 ముంబై లీగ్ వేలం జరుగనుంది. ఇందులో రూ. 5 లక్షల కనీస ధరతో అర్జున్ టెండుల్కర్ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర గల కేటగిరీ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ ఆల్‌రౌండర్ దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
బీసీసీఐ అనుమతితోనే..
అయినప్పటికీ ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అర్జున్‌కు ఈ టీ20 లీగ్ వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. నిబంధనల ప్రకారం.. సంవత్సర కాలం పాటు కూలింగ్ పీరియడ్ పూర్తైన తర్వాత స్థానిక ఆటగాళ్లు ఈ లీగ్‌లో తిరిగి పాల్గొనవచ్చని తెలిపింది.
ఈ విషయం గురించి ఎంసీఏ కార్యదర్శి ఉన్మేష్ ఖన్వీకర్ స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు (అర్జున్).. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అసోసియేషన్ తరఫున టీ20 లీగ్‌లో ఆడటం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్లు వేరే లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అలా అర్జున్ టెండుల్కర్, సిద్ధాంత్ అద్ధాత్‌రావు టీ20 ముంబై లీగ్ సీజన్-4లో ఆడేందుకు అనుమతి లభించింది’’ అని పేర్కొన్నాడు.


