50 Years Team India: ఇంగ్లండ్‌ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ విజయానికి 50 ఏళ్లు

50 Years Complete Team India Won 1st Test Series In England Oval 1971 - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా తొలి టెస్టు సిరీస్‌ విజయం సాధించి నేటితో 50 ఏళ్లు . అజిత్‌ వాడేకర్‌ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లీష్‌ గడ్డపై తొలి టెస్టు విజయంతో పాటు టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకుంది. తాజాగా బీసీసీఐ ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేస్తూ తన ట్విటర్‌లో ఒక వీడియోను షేర్‌ చేసుకుంది. 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి స్పందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: Mark Boucher: 'నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా.. క్షమించండి'

ఈ సందర్భంగా మరోసారి ఆ మ్యాచ్‌ విశేషాలను గుర్తుచేసుకుందాం. తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియడంతో ఓవల్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. అలన్‌ నాట్‌, జాన్‌ జేమ్సన్‌, రిచర్డ్‌ హట్టన్‌ రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేసింది.  ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఇండియా 284 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఫరూక్‌ ఇంజనీర్‌ 59, దిలీప్‌ సర్దేశాయ్‌ 54 పరుగులతో రాణించారు.

అనంతరం 71 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ బి. చంద్రశేఖర్‌ చుక్కులు చూపించాడు. తన లెగ్‌స్పిన్‌ మ్యాజిక్‌తో 6 వికెట్లతో సత్తా చాటిన చంద్రశేఖర్‌ దెబ్బకు 101 పరుగులకు ఆలౌట్‌ అయింది. 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ సునీల్‌ గావస్కర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే కెప్టెన్‌ వాడేకర్‌ 45 నాటౌట్‌, దిలీప్‌ సర్దేశాయ్‌ 40 పరుగులతో రాణించడంతో టీమిండియా ఇంగ్లండ్‌ గడ్డపై తొలి విజయంతో పాటు టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.  అంతేకాదు 26 టెస్టు వరుస టెస్టు విజయాలతో జోరు మీదున్న ఇంగ్లండ్‌ జట్టుకు అడ్డుకట్ట వేసింది. కాగా 1932 నుంచి చూసుకుంటే విదేశాల్లో భారత్‌కు ఇది రెండో టెస్టు సిరీస్‌ విజయం.. అంతకముందు 1971లోనే వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.

చదవండి: రనౌట్‌ కోసం థర్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌; స్క్రీన్‌పై మ్యూజిక్‌ ఆల్బమ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top