హుస్నాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ముసుగులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని ఏఐసీసీ ఇన్‌చార్జి సెక్రటరీ సచిన్ సావంత్ అన్నారు. హుస్నాబాద్ శివారులోని శుభం గార్డెన్‌లో పీసీసీ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ బీఎల్‌ఏలకు శుక్రవారం అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్ సావంత్ మాట్లాడుతూ దేశ ప్రజలు, న్యాయం, సంక్షేమం, అభివృద్ధి అందించే నాయకులనే గుర్తుంచుకుంటారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటే అత్యంత శక్తివంతమైన ఆయుధం అన్నారు. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని ఎన్నికల ప్రక్రియ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. ఓటరు సవరణ పేరిట బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించి ఎన్నికల ప్రయోజనం పొందాలని చూస్తోందన్నారు. ప్రజలను మతం, కులం లేదా ఇతర అంశాల ఆధారంగా విభజించే రాజకీయాలు చేస్తోందన్నారు. తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో పీఎం మోదీని పొల్చడం సరికాదని, నెహ్రూ దేశ అభివృద్ధిలో ఎంతో కీలక భూమిక పోషించారని కొనియాడారు.
అప్రమత్తంగా ఉండాలి
119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్‌లను ఏర్పాటు చేసుకొని ఓట్ల సవరణలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయ కుట్రలో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తోందని తెలిపారు. బీహార్, బెంగాల్, తమిళనాడులో లక్షలాది ఓట్లను తొలగించారన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్‌గా పని చేస్తుందని ఆరోపించారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2.50 లక్షల ఓట్లల్లో 61 వేల ఓట్లు తేడా ఉన్నాయని, బూత్ లెవల్ ఏజెంట్‌లు అప్రమత్తంగా లేకుంటే ఆ ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ఇన్సూరెన్స్ విభాగం చైర్మన్ పవన్ మల్లాది, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ పద్మ, మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర
నెహ్రూతో మోదీని పొల్చడం తగదు
ఏఐసీసీ ఇన్‌చార్జి సెక్రటరీ సచిన్ సావంత్


