ప్రైవేటు టీచర్లపై యాజమాన్యాల ఒత్తిడి ● విద్యార్థుల్ని చేర్పించకపోతే కొలువుపై వేటు
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి బతక లేక బడిపంతులుగా మారింది. ప్రతీరోజు 14 గంటలు పని చేస్తున్నా వారికి కనీస వేతనంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా అమలు కావడం లేదు. ఐఐటీ, సీబీఎస్‌ఈ సిలబస్ బోధించడంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులపై కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇచ్చే అరకొర వేతనాలతో కుటుంబాలను పోషించలేక, మరో ఇతర పనిని చేయలేక ఉపాధ్యాయ వృత్తిలో నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రతీ ఏటా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. దీంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు మరో కొత్త పంథాను ఎంచుకున్నాయి. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం మొదలు విద్యార్థుల్ని పాఠశాలల్లో చేర్పిస్తేనే ఉద్యోగం భద్రంగా ఉంటుంది లేదంటే కొత్త వారికి అవకాశం కల్పిస్తామంటూ ఉపాధ్యాయులకు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు అడ్మిషన్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ఇళ్లకు చేరుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పాఠశాలలో జాయిన్ అయితే ఫీజు తగ్గిస్తామంటూ తల్లిదండ్రులను బుజ్జగించి మరీ అడ్మిషన్లు చేయిస్తున్నారు.
రోజుకో కొత్త పుస్తకం
కొన్ని పాఠశాలలు సెంట్రల్ సిలబస్, మరి కొన్ని పాఠశాలలు స్టేట్ సిలబస్, ఇంకొన్ని పాఠశాలలు ఐఐటీ, సీబీఎస్‌ఈ సిలబస్ అంటూ నిత్యం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఒత్తిడిలోకి నెట్టుతున్నారు. మార్కెట్‌లోకి ఏ పుస్తకాలు వచ్చినా ముందుగా బోధించేది ఉపాధ్యాయులే. వాటిని అర్థం చేసుకుని విద్యార్థులకు చెప్పేందుకు ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. ముందురోజు ప్రిపేర్ కాకపోతే తర్వాత రోజు పిల్లలకు బోధించడం కష్టమే. దీంతో చాలామంది ఉపాధ్యాయులు మానసికంగా కుంగిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
విద్యార్థుల్ని చేర్పిస్తేనే ఉద్యోగం
సంగారెడ్డిలోని ఓ కార్పోరేట్ స్కూల్లో ఇంగ్లీషు సబ్జెక్టు బోధించాను. వేతనం చాలా తక్కువ. అడ్మిషన్లు తీసుకువస్తేనే మీ ఉద్యోగం ఉంటుంది అని యాజమాన్యం చెబుతోంది. మనం తీసుకొచ్చిన విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్ ఫీజు విద్యార్థి చెల్లించలేకపోతే ఉపాధ్యాయుడు వేతనం నుంచి కట్ చేస్తారు.
– శ్రవణ్‌కుమార్ (పేరు మార్చాం),
ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు, సంగారెడ్డి
కొత్త సిలబస్‌తో తప్పని ఇబ్బందులు
ర్యాంకుల కోసం స్టేట్, సెంట్రల్ సిలబస్ అంటూ ప్రతీ ఏటా కొత్త సిలబస్‌ను తీసుకువస్తున్నారు. కొత్తగా వచ్చే సిలబస్ ఎంతో కఠినంగా ఉండటంతో ముందుగా ఒక రోజు ప్రిపేర్ కావాల్సిందే.
– హరినాథ్ గౌడ్ (పేరు మార్చాం),
ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు
చాలీ చాలని జీతం
ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. నర్సరీలోనే రూ.25 వేలకు పైగా వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలు మాత్రం రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపు ఉందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజులను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులకు వేతనాలు అందించేలా ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.


