ఆరేళ్లుగా తైబేజార్‌..! | - | Sakshi
Sakshi News home page

ఆరేళ్లుగా తైబేజార్‌..!

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

టెండర్లకు ఎవరూ రావడం లేదు

టెండర్లు లేక ఏటా రూ.7లక్షల నష్టం

ఆదాయం అంతంత మాత్రమే..

ఆందోల్‌–జోగిపేట మున్సిపాలిటీ తీరు

జోగిపేటలోని కూరగాయల మార్కెట్‌

ఆందోల్‌–జోగిపేట మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది. మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న తైబజార్‌ వేలంపాటలను ఆరేళ్లుగా నిర్వహించకపోవడంతో ప్రతీ ఏటా రూ. 7 లక్షల చొప్పున మున్సిపల్‌ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది.

జోగిపేట: మున్సిపాలిటీ పరిధిలో గత ఆరేళ్లుగా తైబజార్‌ టెండర్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. గత పాలకవర్గంలో మూడుసార్లు, కొత్త పాలకవర్గం వచ్చాక మరో మూడుసార్లు పత్రికల్లో టెండర్ల ప్రకటనలు జారీ చేసినప్పటికీ ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ముందుకు రాలేదు. దీంతో మున్సిపల్‌ సిబ్బందితోనే రోజువారీగా రూ.2 నుంచి 3 వేల వరకు వసూళ్లు చేపడుతున్నారు. ఇటీవల తైబజారు రేట్లను రూ. 20 నుంచి రూ. 30కి పెంచినప్పటికీ ఆశించిన ఆదాయం రావడం లేదు. గతంలో తైబజారు, పశువుల సంత, మేకల సంతల ద్వారా ఏడాదికి రూ. 12 నుంచి రూ. 15 లక్షల ఆదాయం రాగా, ప్రస్తుతం అది కేవలం రూ. 7 నుంచి రూ. 8 లక్షలకే పరిమితమైంది.

కొత్త రోడ్డుతో తగ్గిన వ్యాపారం

పట్టణంలో వ్యాపారాలు క్షీణించడానికి ప్రధాన కారణం సంగుపేట మీదుగా ఏర్పాటు చేసిన బైపాస్‌ రోడ్డు. ఈ కొత్త రోడ్డు కారణంగా ఇతర ప్రాంతాల వ్యాపారులు.. కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయానికి జోగిపేటకు రావడం లేదు. అయితే ఆశించిన స్థాయిలో డబ్బులు రావనే ఉద్దేశంతోనే కాంట్రాక్టర్లు టెండర్లకు దూరంగా ఉంటున్నారు. దీంతో వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం మున్సిపాలిటీకి ఆదాయం అంతంత మాత్రమే ఉంది. 35 మంది పారిశుద్ధ్య కార్మికుల వేతనాలకే నెలకు రూ. 5.60 లక్షలు అవసరమవుతున్నాయి. మంత్రి దామోదర సొంత నియోజకవర్గం కావడంతో ఇతర ఖర్చులు కూడా తోడవుతున్నాయని, టెండర్లకు ఎవరూ రాకపోవడంతో సిబ్బందితోనే నెట్టుకొస్తున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి తెలిపారు.

సొంత స్థలం కరువు

మరోవైపు, పశువుల సంత, మేకల సంతలను నిర్వహించడానికి మున్సిపాలిటీకి సొంత స్థలం లేదు. దీంతో వీటిని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఫలితంగా, ఆ సంతల ద్వారా వచ్చే లక్షల రూపాయల ఆదాయం మార్కెట్‌ శాఖ ఖాతాలోకి వెళ్తోంది. ఈ స్థలాన్ని మార్చాలని మున్సిపల్‌ అధికారులు ఆలోచిస్తున్నారు.

గత ఆరేళ్లుగా ఆరుసార్లు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా తైబజారు వేలంపాటల టెండర్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అందుకే మున్సిపల్‌ సిబ్బందితోనే వసూళ్లు చేయిస్తున్నాం. పశువుల సంత నిర్వహణకు సొంత స్థలం లేకపోవడంతో మార్కెట్‌ యార్డులో నిర్వహిస్తున్నాం. దీంతో ఆ ఆదాయం మార్కెట్‌ శాఖకే వెళ్తోంది.

– తిరుపతి, కమిషనర్‌,

జోగిపేట మున్సిపాలిటీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement