ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు గడిచింది. రాజకీయ సంకటంతో బీఆర్‌ఎస్ రెండు నెలల క్రితం పాలన పగ్గాలు చేపట్టింది. అయినప్పటికీ.. కొలువుదీరిన పాలకవర్గంతో అధికారులకు, అధికార పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్లకు సఖ్యత కుదరడంలేదు. ఇరు పార్టీల రాజకీయ చదరంగంలో కౌన్సిలర్లు పావులు కాగా.. పరిపాలన పడకేసింది. ఫలితంగా అభివృద్ధి కుంటు పడింది. ప్రజాసంక్షేమం గాలిలో దీపంలా మారింది.
డైలమాలో కమిషనర్
పట్నం మున్సిపాలిటీలో అధికారం దక్కించుకున్న ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌కు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా సహకరించడం లేదు. దీంతో పరిపాలన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా.. చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి, కమిషనర్ సుదర్శన్‌లు చేరో దారిలో పయనిస్తున్నారు. అధికార పార్టీ చెప్పింది వినాలా? లేక పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలనే సంకట స్థితిలో కమిషనర్ కొట్టుమిట్టాడుతున్నారు.
వార్డు సభకే చైర్మన్ పరిమితం
ఇరు వర్గాల మధ్య కుదరని సయోధ్యతో చైర్మన్ తన వార్డు సభకే పరిమితమయ్యారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇటీవల నిర్వహించిన వార్డు సభల్లో కౌన్సిలర్ల మధ్య రాజకీయ విభేదాలు మరలా నెలకొన్నాయి. కమిషనర్ సుదర్శన్‌పై అధికార పార్టీ రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చైర్మన్ సుదర్శన్‌రెడ్డి వెళ్లిన ప్రాంతానికి కమిషనర్ వెళ్లని దుస్థితి. దీంతో పలు వార్డు సభలకు హాజరుకావాల్సిన చైర్మన్.. కేవలం తన వార్డు సభకే పరిమితమయ్యారు.
కౌన్సిల్ సమావేశాలకు డుమ్మా
ఫిబ్రవరిలో ఎన్నికలు ముగియగా.. ఇరు పార్టీల మధ్య పొడచూపిన పంచాయితీ కారణంగా ఏప్రిల్ మొదటి వారంలో పాలకవర్గం కొలువుదీరింది. ఈ పీఠాన్ని అధిష్టించిన ప్రతిపక్ష పార్టీ గులాబీకి అధికారుల సహకారం కొరవడింది. నాటి నుంచి జరిగిన రెండు కౌన్సిల్ సమావేశాలకు కమిషనర్ సుదర్శన్ వెళ్లకపోవడం గమనార్హం. ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత ప్రజాతీర్పునకు అనుగుణంగా కలిసి పనిచేయాల్సిన నేతలు, అధికారులు ఆ దిశగా వెళ్లడం లేదు. ప్రజా శ్రేయస్సు, సంక్షేమం, పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
సుదర్శన్‌రెడ్డి, చైర్మన్
సుదర్శన్, కమిషనర్
తారస్థాయికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పంచాయితీ!
పరస్పర సహకారం శూన్యం
పావులుగా మారిన కౌన్సిలర్లు
కుంటుపడిన మున్సిపల్ అభివృద్ధి
సంకటస్థితిలో కమిషనర్, చైర్మన్
కలిసి పనిచేద్దాం
ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి. జెండాలు, విభేదాలను పక్కకు పెట్టి మున్సిపల్ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం. తమకు ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యం. అధికారులు, పాలకులు, ప్రజలు సమష్టిగా సాగితేనే అభివృద్ధి సాధ్యం.
– సుదర్శన్‌రెడ్డి, చైర్మన్, ఇబ్రహీంపట్నం


