అమావాస్య ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అమావాస్య ఎఫెక్ట్‌

Jun 16 2026 7:25 AM | Updated on Jun 16 2026 7:25 AM

తొలిరోజు బోసిపోయిన పాఠశాలలు

భారీగా తగ్గిన హాజరుశాతం

విద్యార్థుల కోసంఎదురు చూసిన బోధనా సిబ్బంది

యాచారం: పాఠశాలల పున:ప్రారంభానికి అమావాస్య అడ్డంకిగా మారింది. తొలి రోజు సోమవారం తల్లితండ్రులు తమ పిల్లలను బడికి పంపించలేదు. మండల పరిధిలో పది ఉన్నత, ఆరు ప్రాథమికోన్నత, 29 ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 3,500 మందికి పైగా చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. అమావాస్య నేపథ్యంలో మొదటి రోజు కేవలం 150 మందే హాజరయ్యారు. ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో వచ్చారు. చిన్నారులకు స్వాగతంపలికేందుకు.. పాఠశాలలకు మామిడి తోరణాలు కట్టారు. కొన్ని పాఠశాలల్లో చిన్నారులకు పుస్తకాలు అందజేశారు.

కడ్తాల్‌లో

కడ్తాల్‌: సెలవుల అనంతరం బడిగంట మోగింది. తొలి రోజు అమావాస్య కారణంగా పాఠశాలలు బోసిపోయాయి. మండల పరిధిలో జెడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీహెచ్‌ఎస్‌ జీయూపీఎస్‌, యూపీఎప్‌, ప్రాథమిక పాఠశాలల్లో 1,226 విద్యార్థులకు తొలిరోజు 142 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.

తగ్గిన హాజరుశాతం

ఇబ్రహీంపట్నం: మండలంలోని 47 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో సుమారు 5,240 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. తొలిరోజు అమావాస్య కావడంతో 1,056 మంది మాత్రమే హాజరయ్యారు. వచ్చిన వారికి పుస్తకాలు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement