చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
చేవెళ్ల: అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఇటీవల ఆయనపై బీఆర్‌ఎస్ నాయకుడు, విద్యా మౌలిక వసతుల సంస్థ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తన 35ఏళ్ల రాజకీయ చరిత్ర ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. నాగేందర్ గౌడ్‌కి రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తి మాజీ మంత్రి చంద్రశేఖర్ అని, ఆయన్ని సైతం మోసం చేశారన్నారు. నవాబ్‌పేట్ ఎంపీపీగా ఉన్నప్పుడు వేయని రోడ్లకు నిధులు మంజూరు చేయించుకున్నాడని, విద్యామౌలిక వసతుల సంస్థ చైర్మన్‌గా ఉండి ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటికై నా అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్, గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


