సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. అనేకచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు సహా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. లైన్లు తెగిపోవడంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై.. మెజార్టీ ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరించినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో అంధకారం తప్పలేదు.
అత్యధికంగా షాబాద్‌లో..
జిల్లాలో అత్యధికంగా షాబాద్‌లో 7.79 సెం.మీ, రాజేంద్రనగర్‌లో 6.06, కేశంపేటలో 5.66, చేవెళ్లలో 4.68, నందిగామలో 3.19, ఫరూఖ్‌నగర్‌లో 3.10 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలికి భారీ వర్షం తోడవడంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. శంషాబాద్‌లోని పలు అపార్ట్‌మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఈసీవాగు పొంగి ప్రవహిస్తోంది. అమ్డాపూర్ సమీపంలో నిండుగా ప్రవహిస్తూ హిమాయత్‌సాగర్ చెరువులోకి వచ్చి చేరుతోంది.
గాలివాన బీభత్సం
విరిగిపడిన చెట్లు
నేలకూలిన విద్యుత్ స్తంభాలు
రోడ్లపైకి భారీగా వరద నీరు
నిలిచిన విద్యుత్ సరఫరా


