హైడ్రాలో బైక్‌ టీమ్‌లు | - | Sakshi
Sakshi News home page

హైడ్రాలో బైక్‌ టీమ్‌లు

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

విపత్కర సమయాల్లో వేగంగా స్పందించేలా..

తొలి దశలో 27 ఏర్పాటు చేసిన రంగనాథ్‌

ఇప్పటికే పనులు ప్రారంభించిన బృందాలు

సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ముంపు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నా.. ఏక్కడ ఏ ప్రమాదం జరిగినా.. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్‌ ఆపరేషన్లు నిర్వహించే డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఈ బృందాలకు సంబంధించిన భారీ వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర వ్యాప్తంగా 27 బైక్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇవి శుక్రవారం నుంచి పని చేయడం ప్రారంభించాయి. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన సమయంలో మెరుగైన సేవలు అందించాయి.

ప్రతి బైక్‌పై ఇద్దరు సిబ్బంది

ఇప్పటి వరకు హైడ్రా అధీనంలోని డీఆర్‌ఎఫ్‌కు 122 వాహనాలు ఉన్నాయి. వీటిలో డీఆర్‌ఎఫ్‌ తేలికపాటి వాహనాలతో పాటు 21 ట్రక్కులు వినియోగిస్తోంది. ఈ ట్రక్కుల్నే ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ కార్యకలాపాలకు వాడుతున్నారు. వీటిలో ప్రత్యేక ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఘనాస్థలికి చేరడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు ఇవి చేరేసరికి జరగాల్సిన నష్టం వాటిల్లుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బైక్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది వినియోగించడానికి ఖరీదు చేసిన 37 ద్విచక్ర వాహనాల్లో 27 వాహనాలకు మార్పులు చేర్పులు చేసి బైక్‌ టీమ్‌లకు అందించారు. ప్రతి బైక్‌పైనా ఇద్దరు డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు ఉపకరణాలు ఉంటాయి. వీటిని ఉంచడానికి వెనుక భాగంలో ప్రత్యేక పెట్టి ఏర్పాటు చేశారు. తొలిదశలో రంగంలోకి దింపిన 27 టీమ్‌ల్లో అత్యధికం ఐటీ కారిడార్‌తో పాటు ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో మోహరించినట్లు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ‘సాక్షి’కి తెలిపారు. దశల వారీగా ఈ బైక్‌ టీమ్‌ సంఖ్యను పెంచుతామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement