మీర్‌పేట: ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు అన్నదమ్ములను తీవ్రంగా గాయపరిచిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అల్మాస్‌గూడకు చెందిన చక్రధర్ శుక్రవారం తన భార్య పుట్టినరోజు ఉండడంతో స్నేహితులను పిలిచి పార్టీ చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున స్నేహితులను ఆర్‌సీఐ రహదారిపై దించేందుకు కారు (టీజీ08ఏ 7887)లో వచ్చి తిరిగి సాయినగర్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కమలానెహ్రూనగర్‌లో నివసించే సోదరులు విఘ్నేశ్వర్ (21), అఖిలేశ్వర్ (18) తమ స్కూటీపై పాల ప్యాకెట్లు సరఫరా చేస్తుండగా మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా నడిపిన చక్రధర్ వీరిని ఢీ కొట్టాడు. విఘ్నేశ్వర్ కాలు ఫ్రాక్చర్ కాగా, అఖిలేశ్వర్ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడే ఉన్న స్థానికులు చక్రధర్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు చక్రధర్‌ను, కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విఘ్నేశ్వర్ ఏవీఎన్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అఖిలేశ్వర్ ఇంటర్ పూర్తి చేశాడు. చదువుకుంటూనే పార్ట్‌టైంగా ఉదయం ఇంటింటికీ పాల ప్యాకెట్లు సరఫరా చేస్తుంటారు. కాగా స్థానికంగా కమలానెహ్రూ నగర్‌లో బెల్టు షాపు ఉండడంతో చక్రధర్ మద్యం కోసమే వచ్చాడని, ఈ క్రమంలోనే అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను కారును అదుపు చేయలేక అన్నదమ్ముల్లిద్దరినీ ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. కారులో ఖాళీ మద్యం సీసాలు, బీర్ బాటిళ్లు ఉన్నాయని తెలిపారు.
స్కూటీని ఢీకొట్టిన వ్యక్తి
అన్నదమ్ములకు తీవ్ర గాయాలు


