షాద్‌నగర్‌రూరల్: ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యంగా రైతుల ముంగిటకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తేవడం జరిగిందని వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయశాఖ అధికారులతో కలిసి శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. నందిగామ మండలంలో యాప్ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయశాఖ కార్యాలయంలో డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎరువులు కొనుగోలు చేయడానికి రైతులు గంటల తరబడి పడిగాపులు కాయడం, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించడం లాంటివి చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని అందుబాటులో తెచ్చిందని చెప్పారు. ఈ యాప్‌ద్వారా సులభంగా ఇంటినుంచే ఎరువులను బుక్ చేసుకోవచ్చని, దీంతో సమయం ఆదా అవుతుందని, పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు. యాప్‌పై గ్రామాల్లోని ఆదర్శ రైతులతో పాటు రైతులందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మేడ్చల్‌తో పాటు మరో ఐదు జిల్లాల్లో అమలు చేయడం జరుగుతోందన్నారు. సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి శైలజ, ఏడీలు మాధవి, సత్యంబాబు, ఏడీఏ రమాదేవి, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.
వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్


