ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ఆరోపించారు. ఆమనగల్లులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. అధికారం, ఆధిపత్యం కోసం బీజేపీ సర్కార్ ఇన్నాళ్లు ఓటు చోరీ చేసిందని, ప్రస్తుతం సీటు చోరీ చేసిందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సీటు చోరీ కుట్రలో భాగమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గద్దె దింపడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి బీజేపీ, బీఆర్‌ఎస్ పగటి కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, మహానీయుల జీవిత చరిత్రను ప్రజలకు వివరించి చైతన్యం చేయడానికి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రెండు బస్సు యాత్రలు జూలై 2న అలంపూర్, మైసిగండిలో ముగుస్తాయని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్‌గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఖాదర్, పార్టీ జిల్లా నాయకులు చెంచు రాములు, కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జగన్, మానయ్య, కాలె మల్లయ్య, శ్రీకాంత్, ఖాదర్‌ఖాద్రి, మండల మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి


