ముంపు ముప్పు తప్పదా.. | - | Sakshi
Sakshi News home page

ముంపు ముప్పు తప్పదా..

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

పరిశీలించినా.. ఫలితం శూన్యం

వానాకాలం మొదలు..

వణుకుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు

పరిష్కారం చూపని అధికారులు

తుర్కయంజాల్‌: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏటా ఆదిబట్ల సర్కిల్‌ పరిధి పలు కాలనీల్లో ముప్పు పొంచి ఉన్నా.. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం అని ఆరోపణలు వస్తున్నాయి. వరదల నుంచి గుణపాఠం నేర్చుకుని, మరోసారిముంచెత్తకుండా ప్రణాళికలు రూపొందించాల్సింది పోయి, ఏమి పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో.. తమ ఇళ్లు నీట మునుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రహరీలు, కాల్వల ధ్వంసం

మన్నెగూడలో ఎర్రకుంట చెరువు చుట్టూ ప్రహరీ నిర్మించడం, అలుగును పూర్తిగా ధ్వంసం చేయడం వలన ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు సులువుగా చెరువులోకి చేరి, బయటకు ప్రవహించే పరిస్థితి లేదు. దీని వలన శ్రీశ్రీ అరుంధతి, సిరిటౌన్‌ షిప్‌తో పాటు పలు కాలనీలకు ఏటా ముంపు ముప్పు వెంటాడుతోంది. అదే విధంగా గంగరాయి చెరువు కబ్జా, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో యథేచ్ఛగా వెంచర్ల ఏర్పాటు, ఇరిగేషన్‌ అధికారులు ఎన్‌ఓసీలు జారీ చేయడంతో చెరువు పూర్తిగా అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు కనిపనిస్తున్నాయి. దీనికి తోడు చెరువులోకి నీరు చేరుకునే కాల్వ అన్యాక్రాంతం అయింది. దీంతో ఈ చెరువు పై భాగంలో వర్షం కురిస్తే.. నీరు ఒక్కసారిగా పై కాలనీలోని ఇళ్లతో పాటు, జీవీఆర్‌ కాలనీ, రాగన్నగూడ పాత గ్రామం, దుర్గాంజనాద్రి కాలనీలను ముంచెత్తుతోంది. చిన్న పాటి వర్షానికే చెరువులను తలపించేలా ఇళ్ల మధ్యలో నీరు నిలుస్తూ ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇవే కాకుండా పాటిగూడలోని కాలనీలు, సూరజ్‌ నగర్‌, రాఘవేంద్ర నగర్‌ కాలనీ మాసబ్‌ చెరువులోకి నీరు చేరే కాల్వ కబ్జా కావడంతో ఇక్కడి పరిస్థితులు అలాగే ఉన్నాయి.

రాకపోకలు బంద్‌

మాసబ్‌ చెరువు 2020 నుంచి వరద నీటితో పాటు.. మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్‌గుల్‌, బడంగ్‌పేట, గుర్రంగూడ, ఆదిబట్ల సర్కిల్‌ పరిధి రాగన్నగూడ, కమ్మగూడ, తుర్కయంజాల్‌లోని పలు కాలనీల నుంచి వస్తున్న మురుగుతో నిత్యం నిండు కుండలా తలపిస్తుంది. గడిచిన 6 ఏళ్లుగా చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని అలుగు పారుతోంది. సుమారు 500 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు.. వాగు ఉప్పొంగితే ఇంజాపూర్‌లోని ఆపిల్‌ అవెన్యూ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఏటా నీట మునుగుతున్నాయి. వరద ఉధృతి కారణంగా అవెన్యూ కాలనీ నుంచి పలు కాలనీలకు రాకపోకలు నిలిచిపోతాయి. కాల్వను ఆనుకుని నిర్మించిన అపార్ట్‌మెంట్లు, పలు నివాసాలు జలమయం అవుతాయి. ఆ సమయంలో ఈ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఇంజాపూర్‌లోని దిలావర్‌ఖాన్‌ చెరువు వలన మునగనూర్‌లోని పలు కాలనీలు ముంపు బారిన పడతాయి. సుదీర్ఘ కాలం వీరామం అనంతరం మునగనూర్‌ నుంచి హయత్‌నగర్‌కు వెళ్లే చోట బ్రిడ్జి నిర్మించడంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ.. వరద ఎక్కువగా వచ్చిన సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు.

ఆపిల్‌ అవెన్యూ కాలనీలో జలప్రవాహం (ఫైల్‌)

ఇళ్ల మధ్యలో ప్రవహిస్తున్న మాసబ్‌ చెరువు వరద (ఫైల్‌)

మాసబ్‌ చెరువు నుంచి దిలావర్‌ ఖాన్‌ చెరువుకు నీరు ప్రవహించే కాల్వను గతంలో హైడ్రా కమిషనర్‌ రంగనాఽథ్‌ పరిశీలించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. పరిష్కార మార్గం లభించలేదు. ఎప్పటిలాగే కాలనీలు నీట మునుగుతూనే ఉన్నాయి. అధికారులు ఇప్పటికై నా పక్కా ప్రణాళికలు రూపొందించి, ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ బి.సత్యనారాయణ రెడ్డిని వివరణ కోరగా.. ముంపునకు గురయ్యే కాలనీల జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. తగిన చర్యలు చేపట్టి, సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement