అడ్మిషన్లు ప్రారంభం
కడ్తాల్: గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థినులకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)వరంగా మారాయి. ఈ విద్యాలయాల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని పేదవారితో పాటు.. అనాథ, తండ్రిలేని, తండ్రి ఉండి తల్లిలేని వారికి, చదువు మధ్యలో ఆపేసిన వారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అనేక సౌకర్యాలు, వసతులుకల్పిస్తూ.. వారి భవితకు బాటలు వేస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుండటంతో ఇందులో ప్రవేశానికి పోటీ పెరిగింది. విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
పదిలో 98 శాతం..
మండల కేంద్రంలో 2017– 18 విద్యా సంవత్సరంలో 6,7,8 తరగతులతో అద్దె భవనంలో కేజీబీవీ ప్రారంభమైంది. ఏటా తరగతులు పెరుగుతున్నాయి. భవనం చాలక పోవడంతో ప్రభుత్వం నూతన భవనం నిర్మించింది. అందులో 2024లో తరగతులు ప్రారంభించింది. గత ఏడాది 2025– 26 విద్యా సంవత్సరంలో ఆరు నుంచి 10వ తరగతి వరకు 255 మంది విద్యార్థినులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం 56 మంది అభ్యసించారు. 2025– 26లో పదిలో 43 మందికి 42 మంది 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన శాఖాహారం, మాంసహారంతో భోజనం అందించడంతో పాటు, వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. విద్యార్థినులు చదువుకే పరిమితం కాకుండా ఆత్మరక్షణ కోసం కరాటే తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తోంది.
ఇంటర్‌లో వందశాతం
2025– 26లో కేజీబీవీని ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇంటర్ తరగతులు ప్రారంభించింది. బైపీసీ, ఎంపీసీ ఒక్కో గ్రూప్‌లో 40 సీట్లు కేటాయించడంతో ఎంపీసీలో 23 మంది విద్యార్థులు, బైపీసీలో 33 మంది చేరారు. ఇందులో మొత్తం 56 మందికి 56 మంది ఉత్తీర్ణత సాధించి, 100 శాతం ఫలితాలు సాధించారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కాగా.. ఈ ఏడాది సెకండీయర్ బైపీసీ, ఎంపీసీ ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో గ్రూప్‌లో 40 సీట్లు ఉండనున్నాయి.
బాలికలకు వరం విద్యాలయాలు
అద్భుతంగా రాణిస్తున్న విద్యార్థినులు
ఆరు నుంచి ఇంటర్ వరకు తరగతులు
కేజీబీవీ అప్‌గ్రేడ్ అయింది. ఇంటర్ వరకు తరగతులు జరుగుతున్నాయి. దీంతో విద్యార్థినులకు చదువులో ఆటంకం కలిగే ఆస్కారం లేదు. ఆంగ్ల మాధ్యమంలో బోధించడంతో పాటు, నాణ్యమైన విద్య, భోజన వసతిని ప్రభుత్వం కల్పిస్తోంది. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పేద విద్యార్థినులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– అనిత, ఎస్‌ఓ, కేజీబీవీ పాఠశాల, కడ్తాల్


