ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాల 50 వసంతాల వేడుక స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిధి ఆకుతోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థులు (1976– 2026) గోల్డెన్ జూబ్లీ నిర్వహించారు. వేడుకలను జెడ్పీటీసీ మాజీ సభ్యడు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సర్పంచ్ నరేందర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేడుకలకు నాటి నుంచి చదివిన విద్యార్థులు చాలామంది హాజరయ్యారు. ఒకే వేదికగా ఆటపాటలతో సందడి చేశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకున్న బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని, విశాలమైన గదులు, వసతులు, ఆటస్థలం ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని కోరారు. పూర్వ విద్యార్థులంతా తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేస్తే.. పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు చందులాల్, చిలకమ్మ, మాజీ సర్పంచ్‌లు రామచంద్రయ్య, ప్రమోద్‌కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యడు రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆటపాటలతో సందడి చేసిన పూర్వ విద్యార్థులు
పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని పిలుపు


