హస్తినాపురం: పోర్టర్ డ్రైవర్ పార్ట్నర్ల సమస్యలను పరిష్కరించడంలో పోర్టర్ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, డ్రైవర్ల శ్రమను దోపిడీ చేస్తూ వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అజయ్‌బాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జూన్ 16న నిర్వహించనున్న పోర్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన డ్రైవర్లకు పిలుపునిచ్చారు. సాగర్ రింగ్ రోడ్డులోని సెంటర్‌లో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ పోర్టర్ కమిటీ ఆధ్వర్యంలో పోర్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను అజయ్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోర్టర్ యాజమాన్యం డ్రైవర్లను పార్ట్నర్లుగా పేర్కొంటున్నప్పటికీ వారికి తగిన ప్రయోజనాలు కల్పించడం లేదన్నారు. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగునంగా రవాణా చార్జీలను పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ, డ్రైవర్లకు కనీస గిట్టుబాటు రేట్లు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. డ్రైవర్ల కష్టాన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా వారి పొట్ట కొట్టేలా వ్యవహరించడం సరికాదిన్నారు. డ్రైవర్ల శ్రమకు తగిన విలువ ఇచ్చి గిట్టుబాటు అయ్యే రేట్లు నిర్ణయించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు ఏకమై పోరాటాలను ఉదృతం చేస్తారని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరహరి, ఎల్లయ్య ఉన్నారు.


