పచ్చని పల్లెల్లో మైనింగ్‌ ప్రక్రియలు చేపడితే పర్యావరణం పాడవడంతో పాటు ప్రజా జీవనానికి ముప్పు వాటిల్లనుందని ఆయా గ్రామాల ప్రజలు తిరగబడుతున్నారు. ముక్తకంఠంతో గనుల తవ్వకం చేపట్టొద్దని ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. | - | Sakshi
Sakshi News home page

పచ్చని పల్లెల్లో మైనింగ్‌ ప్రక్రియలు చేపడితే పర్యావరణం పాడవడంతో పాటు ప్రజా జీవనానికి ముప్పు వాటిల్లనుందని ఆయా గ్రామాల ప్రజలు తిరగబడుతున్నారు. ముక్తకంఠంతో గనుల తవ్వకం చేపట్టొద్దని ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

తొల్చగుట్టను తవ్వద్దు

మంచాల: మండలంలోని చిత్తాపూర్‌ రెవెన్యూ పరిధిలో 92 సర్వే నంబర్‌లో 270 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అందులో 36 మందికి 237 ఎకరాలు ప్రభుత్వం సర్టిఫికెట్లు పంపిణీ చేయగా మరో 33 ఎకరాలు మిగులు భూమి ఉంది. అందులో ఉన్న తొల్చగుట్టను ప్రభుత్వం సేవియర్‌ మైన్స్‌ అండ్‌ మినరల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి మైనింగ్‌కు కేటాయించింది. రూ.3 కోట్లతో 15.378 హెక్టార్లలో క్వారీ మైనింగ్‌ తీసుకునేందుకు అనుమతులు సైతం వచ్చాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసులు జారీ చేసింది. బుధవారం ఫ్యూఛర్‌ సీటీలో ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

మైనింగ్‌ రద్దుకు పోరాటం

ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురైన గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. భూముల రేట్లు పెరిగాయి. తొల్చగుట్టలో మైనింగ్‌ ఏర్పాటుతో చిత్తాపూర్‌తో పాటు ఆప్రాంతం అనుసరించి ఉన్న తిప్పాయిగూడ, తాళ్లపల్లి గూడ గ్రామాల ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ మైనింగ్‌ ఏర్పాటు తమ భూములు రేట్లు పడిపోవడంతో పాటు వ్యవసాయం దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా సమావేశాలు ఏర్పాటు చేసి మైనింగ్‌ రద్దు చేయాలని పోరాటాలకు పిలుపునిచ్చారు.

పదేళ్ల క్రితమే చైతన్యం

పదేళ్ల క్రితం మండలంలోని ఆరుట్ల రెవెన్యూ పరిధిలోని 1,363 సర్వే నంబర్‌లో మైనింగ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. పర్యావణవేత్త దొంతి నర్సింహారెడ్డి, సరస్వతి కవుల తదితరులు ప్రజలను చైతన్యంచేశారు. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఆందోళన చేపట్టి మైనింగ్‌ను అడ్డుకున్నారు.

చిత్తాపూర్‌లో

మైనింగ్‌ మంట

15.378 హెక్టార్లలో గనుల తవ్వకానికి అనుమతిచ్చిన ప్రభుత్వం

రూ.3 కోట్లకు సేవియర్‌ మైన్స్‌ అండ్‌ మినరల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయింపు

బుధవారం ముఖ్యమంత్రి మీటింగ్‌ కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా

ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న ప్రజలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement