జంట హత్యల కేసు ప్రధాన నిందితురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

జంట హత్యల కేసు ప్రధాన నిందితురాలి మృతి

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

● చికిత్స పొందుతూ నిమ్స్‌లో మరణించిన కరీమాబీ

తాండూరు/తాండూరు రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలైన కరీమాబీ(50) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి నిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాండూరులోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో నివాసం ఉండే కరీమాబీ తనకు పరిచయమున్న మహిళల వద్ద అప్పులు తీసుకుంది, డబ్బుల కోసం ఒత్తిడి చేసిన వారిని అంతమొందించేందుకు పథకం వేసింది. ఈక్రమంలో తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబ్‌బీ(58), బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌కు చెందిన అంగన్‌వాడీ ఆయా అబేదాబేగం(60)లను మొయినాబాద్‌లోని ఓ ప్రైవేటు ఫాంహౌస్‌లో హత్య చేసి, అక్కడే పూడ్చిపెట్టింది. ఇందుకు రహ్మాన్‌, నయీం అనే ఇద్దరు వ్యక్తుల సాయం తీసుకుంది. మహిళల మిస్సింగ్‌పై విచారణ చేపట్టిన పోలీసులు కాల్‌డాటా ఆధారంగా నిందితులను పట్టుకుని, విచారించారు.

వాష్‌రూమ్‌ క్లీనర్‌ తాగి..

తాండూరులోని సీఐ కార్యాలయంలో గత నెల 17న పోలీసులు కరీమాబీని విచారించారు. ఈ సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్తానని చెప్పిన ఆమె అక్కడే ఉన్న బాత్‌రూమ్‌ క్లీనర్‌(ఫినాయిల్‌) తాగింది. వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం నగరానికి తరలించారు. 25 రోజులుగా చికిత్స పొందిన కరీమా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో నిమ్స్‌ ఆస్పత్రిలో చనిపోయింది. ఆమె మృతదేహానికి తాండూరులో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులు బాడీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు..

జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమాబీ ఆత్మహత్యాయత్నం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ స్నేహ మెహ్ర గత ఆదివారం కానిస్టేబుళ్లు సునీత, బస్వరాజ్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు.

ఏం జరిగిందంటే..

తాండూరు మున్సిపల్‌ పరిధిలోని రాజీవ్‌గృహకల్పకు చెందిన కరీమాబీ ఇదే కాలనీకి చెందిన అబ్దుల్‌ రహ్మాన్‌తో సహజీవనం చేసేది. వీరిద్దరూ అధిక వడ్డీ ఆశచూపి అమాయక మహిళల వద్ద అప్పులు చేశారు. ఈ సొమ్ముతో జల్సాలు చేస్తూ గడిపారు. వాయిదా ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడి చేయగా, వీరి పక్కనే ఉండే మహబూబ్‌బీని హత్య చేయాలని పథకం వేశారు. మొయినాబాద్‌ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌కు వస్తే డబ్బులు ఇస్తామని నమ్మించారు. నయీంపాష అనే మరో వ్యక్తితో కలిసి మార్చి 27న ఆమెను హత్యచేశారు. అనంతరం కాశీంపూర్‌ గ్రామానికి చెందిన అబేదాబేగంను సైతం ఫామ్‌హౌస్‌కు రమ్మని మే 5న హతమార్చారు. మృతుల సెల్‌ఫోన్‌ లొకేషన్ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

పోలీసు వర్గాల్లో ఆందోళన

కరీమాబీ మృతి పోలీసు వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఆమెకు మెరుగైన చికిత్స అందేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సొంత ఖర్చులతో కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యానికి సైతం వెనకాడలేదని తెలుస్తోంది. కరీమాబీ చనిపోతే తమ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుందనే కారణంతో ఇదంతా చేశారని సమాచారం. కానీ ఆమె మృతితో కథ మొదటికి వచ్చినట్లైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement