● నాలుగు మండలాల్లో విచారణ ● వెలుగు చూసిన వ్యవసాయ శాఖ అక్రమాలు ● నేరుగా రైతులను కలిసిన పంచాయతీ కార్యదర్శులు ● 90శాతం మంది వేరుశనగ విత్తనాలు తీసుకోలేదని వెల్లడి
కొడంగల్/బొంరాస్‌పేట/దౌల్తాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో వ్యవసాయాధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలను దోచేశారు. బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గురువారం కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాల్లో అక్రమాలు జరిగినట్లు బహిర్గతం అయింది. వంద, యాభై శాతం సబ్సిడీపై పంపిణీ చేయాల్సిన విత్తనాలను వ్యవసాయాధికారులు గట్టు చప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కలెక్టర్ దీపక్ తివారి ఆదేశాలతో విచారణ చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ జరిగింది. పంచాయతీ కార్యదర్శులు రైతుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. 90 శాతం మందికి పైగా విత్తనాలు తీసుకోలేదని తెలిసింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు రైతుల నుంచి సంతకాలు తీసుకున్నారు. అక్రమాల నేపథ్యంలో దుద్యాల్ ఏఓ, ఇద్దరు ఏఈఓలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దుద్యాల్, రేగడిమైలారం ఏఈఓల దగ్గర ఉన్న రికార్డులను జిల్లా విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంట, బుర్రితండా, కాకర్లగండి తండా, బురాన్‌పూర్, మదన్‌పల్లి, లోతికుంటతండా, కొత్తూరు, సాలిండాపూర్, వడిచర్ల గ్రామాల్లో జీపీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. దౌల్తాబాద్ మండలం గోకఫసల్‌వాద్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో విత్తన అక్రమాలపై ఫిర్యాదులు అందాయి. ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు వివరాలు సేకరించారు.


