ఇబ్రహీంపట్నం రూరల్: వేసవి సెలవుల గడువుకు ముగింపు దగ్గర పడుతోంది. బడులు ప్రారంభం కావాల్సిన సమయం రానే వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఏటా జూన్ 12వ తేదీన విద్యాసంస్థలు పునఃప్రారంభం అవుతాయి. కానీ ఈసారి ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో మూడు రోజులు ఆలస్యంగా బడులు ప్రారంభిస్తున్నారు. 15వ తేదీన బడులు తెరుచుకోనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి.
89 శాతం పుస్తకాలు పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి ముందుగానే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్ సిద్ధం చేయాల్సి ఉంది. గత, నేటి ప్రభుత్వాలు ఇదే విధంగా పనులు చేపడుతున్నాయి. మండలంలో 46 ప్రభుత్వ పాఠశాలలు, మూడు రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. వీటిలో 7,210 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా బడులు తెరుచుకోవడానికి ముందే పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. ఈసారి 42,052 పుస్తకాలు మండల విద్యాధికారి కార్యాలయం నుంచి ఆయా బడులకు చేరవేశారు. 89 శాతం పుస్తకాలు అందించారు. ప్రభుత్వం చెప్పినట్లుగా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు నోట్‌బుక్స్ కూడా 43,000 అందజేశారు. గతంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే వర్క్ బుక్స్ ఇచ్చేది. కానీ ఈ సారి అన్ని తరగతుల విద్యార్థులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
అల్పాహారం ఎప్పుడు
సీఎం రేవంత్‌రెడ్డి విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని అల్పాహారం తీసుకొస్తామని చెప్పారు. కానీ నేటికి దానిపై ఉలుకు పలుకు లేదు. అలాగే విద్యార్థి కిట్ పేరుతో 9 రకాల సామగ్రి అందజేస్తామని ప్రకటించారు. ఈ పథకం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రారంభిస్తామని అన్నారు. అందులో భాగంగా యూనిఫాం, బ్యాగు, ష్యూ, టై, బెల్టు, ఐడీ కార్డు, సాక్సులు, ప్లేటుతో పాటు స్టేషనరీ సామగ్రి ఇస్తామని పేర్కొన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరోవైపు ప్రైవేటు బడుల్లో ఫీజుల పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు.
15న తెరుచుకోనున్న విద్యాసంస్థలు
ఇప్పటికీ పత్తాలేని యూనిఫాంలు
బడులకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
నేటికీ అందని విద్యార్థుల కిట్లు
స్కూల్ డ్రస్సుల జాడేది?
అన్ని బాగానే ఉన్నా యూనిఫాం(ఏకరూప దుస్తులు) విషయంలో స్పష్టత లేదు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం యూనిఫాంలు కుట్టించి సిద్ధం చేసేది. ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున స్కూల్ దుస్తులు అందజేస్తుంది. కానీ ఈసారి సమయం దగ్గర పడుతున్నా కనీసం క్లాత్ కూడా పాఠశాలకు చేరుకోలేదు. కొలతలు తీసుకునేది ఎప్పుడు.. కుట్టేది ఎప్పుడు.. పిల్లలకు ఇచ్చేది ఎప్పుడని వాపోతున్నారు. ముందస్తుగా పంపిణీ చేయకుండా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
సుదీర్ఘ ఎండకాలం సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 15న తెరుచుకోనున్నాయి. పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరుగుతున్నా యూనిఫాం విషయంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది.
పుస్తకాలు చేరవేశాం
ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్ప టికే బడులకు పుస్తకాలు చేరవేశాం. అల్పాహారం, స్టూడెంట్ కిట్లు పథకం అమలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి బలోపేతం చేయండి. మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రస్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఉచితంగా ఇస్తాం.
– హీర్యానాయక్, ఎంఈఓ, ఇబ్రహీంపట్నం


